భారతీయ సంతతికి చెందిన అరుణా మిల్లర్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టిన మొదటి వలసదారుగా ఆమె నిలిచారు. ఆమె తెలుగువారు కావడం మరో విశేషం.

భారతీయ సంతతికి చెందిన అరుణా మిల్లర్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టిన మొదటి వలసదారుగా ఆమె నిలిచారు. ఆమె తెలుగువారు కావడం మరో విషేషం. అమెరికాలో మధ్యంతర ఎన్నిక పోలింగ్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఇందుకు సంబంధించి ఫలితాలు వెలువడుతుండగా.. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మేరీల్యాండ్ గవర్నర్‌గా డెమోక్రాటిక్ నేత వెస్ మూడు, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్.. వారి ప్రత్యర్థులైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై విజయం సాధించారు. ఇక, గవర్నర్ తర్వాతి అత్యున్నత స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. గవర్నర్ మరణించినా, రాజీనామా చేసినా లేదా పదవి నుండి తొలగించబడినా లెఫ్టినెంట్ గవర్నర్ కూడా గవర్నర్ అవుతారు.


‘‘నేను 1972లో ఈ దేశానికి వచ్చినప్పటీ నుంచి.. అమెరికా కోసం ఉత్సాహంగా ఉండటం ఎప్పుడూ ఆపలేదు. నేను పోరాడుతూనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంది’’ అని ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అరుణా మిల్లర్ ట్వీట్ చేశారు. ప్రజలు తమ కమ్యూనిటీకి, తమకు తాముగా సురక్షితంగా భావించే మేరీల్యాండ్‌ను సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెబుతూ మిల్లర్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

అరుణా మిల్లర్ విషయానికి వస్తే వారి కుటుంబానికి తెలుగు నేపథ్యం ఉంది. ఆమె 1964 నవంబర్ 6న అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణకు ఏడేళ్ల వయసు ఉన్న సమయంలో ఆమె కుటుంబం యూఎస్‌కు వలస వెళ్లింది. ఆమె న్యూయార్క్‌లో పెరిగారు. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఇక, 1989లో మిస్సౌరీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో అరుణా మిల్లర్ పట్టా పొందారు. మోంట్‌గోమేరీ కౌంటీలోని స్థానిక రవాణా విభాగంలో 25 సంవత్సరాలు పనిచేశారు. ఆమె 2000లో యూఎస్ పౌరసత్వం పొందారు. 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో మేరీల్యాండ్‌లోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో పోటీ చేసిన ఆమె విజయం సాధించలేకపోయారు.