అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేయించి. అమెరికా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 

ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలేమని హత్యకుగాను ట్రంప్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ చేసింది ఇరాన్. ఇందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ని కూడా అభ్యర్థించింది ఇరాన్. అమెరికా తన డ్రోన్ల ద్వారా ఈ సంవత్సర ఆరంభంలో బగ్దాద్ ఎయిర్ పోర్ట్ వద్ద సోలెమాని ని హత్య చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో ట్రంప్ తోసహా మరో 30 మంది పై అభియోగాలు నమోదైనట్టు తెలియవస్తుంది. నిందితులపై హత్య, ఉగ్రవాదం వంటి ఆరోపణలను మోపారు. ఆయన పదవి కాలం పూర్తయ్యాక అరెస్ట్ చేయాలనీ ఇరాన్ భావిస్తుంది. 

ఇదిలా ఉండగా ఇరాన్ ఇచ్చిన నోటీసు పై స్పందించేందుకు ఇంటర్పోల్ ప్రతినిధులు నిరాకరించారు. ట్రంప్ ని ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేకున్నప్పటికీ.... రెడ్ కార్నర్ నోటీసు అయినా ఇవ్వాలని ఇరాన్ ఇంటర్ పోల్ ని కోరింది. 

ఖాసీం సొలేమని ని తీవ్రవాది అంటూ అమెరికా వ్యాఖ్యానించినప్పటికీ... సొంత దేశం ఇరాన్ లో మాత్రం ఆయనొక జాతీయ హీరో. ఆయన మరణ వార్త ఇరాన్ లో తీవ్ర విషాధాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. 

ఆయన జాతీయంగా ఇంతపెద్ద హీరో అంటే... ఆయన అంత్యక్రియలకు యావత్ దేశం తరలివచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇరాన్ లో ఆయన అంత్యక్రియలు ఎంత భారీగా జరిగాయంటే.... ఆ అంత్యక్రియల్లో తొక్కిసలాట చోటుచేసుకొని 35 మంది మరణించారంటే ఎంతమంది ఆ అంత్యక్రియలకు హాజరయ్యారో అర్థం చేసుకోవచ్చు. 

సొలేమాని హత్యానంతరం ఇరాన్ అమెరికా మీద పగ తీర్చుకుంటాం అని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ముగిసిన తెల్లారే.... అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు తెగబడ్డ విషయం విదితమే!