అమెరికా అట్లాంటా ఎయిర్‌పోర్టులో సుమారు ఐదు లక్షల తేనెటీగలు నిర్జీవమై పోయాయి. కాలిఫోర్నియా నుంచి అలస్కాకు సప్లై చేస్తున్న ఈ తేనెటీగల కార్గో అనుకోని కారణాలతో అట్లాంటా ఎయిర్‌పోర్టులో చిక్కిపోయింది. నాలుగు రోజుల తర్వాత అవి కంటైనర్ల నుంచి బయటకు రావడం మొదలుపెట్టాయి. దీంతో సిబ్బంది ఆ కంటైనర్‌ను ఎండలో పెట్టారు. ఎండవేడిమి కారణంగా  ఆ తేనెటీగలు అన్నీ మరణించాయి. 

న్యూఢిల్లీ: తేనెటీగలే కదా.. అవి చచ్చిపోతే పోయేదేముందిలే.. మహా అయితే తేనె కొంత తగ్గుతుంది అనే ఆలోచనలు చేస్తే పొరబడినట్టే. పర్యావరణ సంతులనంలో ప్రతి జీవికి దాని ప్రాధాన్యత తప్పకుండా ఉండి ఉంటుంది. కూరగాయలు, ఫలాలు, పూవులు.. ముఖ్యంగా పరపరాగ సంపర్కం జరిపే మొక్క జాతుల మనుగడకు తేనెటీగలు అత్యంత కీలకమైనవి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే ఒకరకంగా మన కంచంలోని ఆహారానికీ గండీ పడినట్టే. అందుకే కొంతకాలంగా తేనెటీగల సంరక్షణకు ఉద్యమాలూ జరుగుతున్నాయి. పర్యావరణ మార్పులు జరిగితే తొలుత నశించే జాతుల్లో తేనెటీగలు ఉన్నాయి. అందుకే ఈ పర్యావరణ మార్పులు కలిగించే ఉత్పాతాల్లో ఇదీ ఒకటిగా ఉన్నది. ఇదిలా ఉండగా, అమెరికాలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సుమారు ఐదు లక్షల తేనెటీగలు నిర్జీవంగా పడిపోయాయి.

కాలిఫోర్నియా నుంచి అలస్కాకు తరలిస్తున్న సుమారు ఐదు లక్షల తేనెటీగలు అట్లాంటా ఎయిర్‌పోర్టులో మరణించాయి. అట్లాంటా ఎయిర్‌పోర్టులో ఆ తేనెటీగలను దాచిన క్రేట్స్‌ను ఎండకు రోడ్డపై ఉంచారు. ఈ ఎండ వేడిమితోనే ఆ తేనెటీగలు అన్నీ చనిపోయాయి. ఈ విషయం అలస్కాలో ఈ డెలివరీ కోసం ఎదురుచూస్తున్న సారా అలస్కా హనీ యజమాని సారా మెక్ ఎల్రియాకు తెలిసింది. ఆమె వెంటనే ఆ డెలివరీని ఎయిర్‌పోర్టుకు చెందిన వ్యక్తిని కాంటాక్ట్ చేసింది. ఆయన వెంటనే ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆ తేనెటీగల గురించి వాకబు చేసిన తర్వాత అవన్నీ చనిపోయినట్టు తెలిసింది.

సుమారు రెండు వందల ప్యాకేజీల్లో ఈ తేనెటీగలు కాలిఫోర్నియాలోని సాక్రామెంటో నుంచి నేరుగా అలస్కాకు చేరాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ ప్యాకేజీ అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆగిపోయాయి. సుమారు నాలుగు రోజుల తర్వాత ఆ తేనెటీగలు ఆ క్రేట్‌ల నుంచి బయటకు వస్తుండటాన్ని సిబ్బంది గమనించారు. దీంతో ఆ కార్గో కంటైనర్లను బయటకు తెచ్చి ఎండలో ఉంచారు. ఆ ఎండ కారణంగా తేనెటీగలు అన్నీ మరణించాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

తమకు వచ్చే ఈ తేనెటీగల లోడ్‌ అలస్కాలోని ఫెయిర్‌బ్యాంక్స్‌కు వెళ్లాల్సిందని, ఆ తర్వాత అవి వాలసిల్లా నుంచి తల్కీట్న వరకూ చేరాల్సి ఉండిందని సారా మెక్ ఎల్రియా వివరించారు. వీటి విలువ సుమారు 800 పౌండ్లు అని తెలిపారు.

అలస్కాలోని తేనెటీగలకు గుంపుగా జీవించే లక్షణాలు లేవు. తద్వార అవి తేనెతుట్టెలు పెట్టవు. కాబట్టి, అలస్కా వాసులు వాటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే, అలస్కాలోని అతిశీతలం కారణంగా ఇక్కడ కూడా ఆ తేనెటీగలు బతకవు.