చాలా సినిమాల్లో చూసే ఉంటారు. చాలా మంది దొంగలు మారు వేషాల్లో వచ్చి చాలా ప్లాన్డ్ గా డబ్బులు దోచుకుపోతూ ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే బ్రెజిల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.  బ్రెజిల్‌ లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఓ ముఠా బ్రెజిల్ ఎయిర్‌ పోర్టులో 750 కిలోల బంగారాన్ని ఎత్తుకుపోయారు. కస్టమ్స్‌, పోలీసు అధికారుల పటిష్ట బందోబస్తు ఉన్న ఎయిర్‌ పోర్టులోనే దోపిడికి పాల్పడ్డారు . 

న్యూయార్క్‌ నుంచి స్విట్జర్లాండ్‌, జూరిచ్‌ కు తరలించే బంగారాన్ని కొట్టేయాలని ప్లాన్‌ చేశారు. బ్రెజిల్ ఎయిర్‌ పోర్టుకు రాగానే.. ఫెడరల్ పోలీస్‌ అధికారుల వేషంలో విమానాశ్రయంలోకి చొరబడ్డ నలుగురు సభ్యుల ముఠా.. నానా హడావుడి చేసి ఎయిర్‌ పోర్టు లేబర్‌, అధికారులను కంగారు పెట్టారు. బంగారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే తమ వాహనంలోకి మార్చాలని చెప్పారు. ఆ తర్వాత తాపీగా అక్కడి నుంచి ఉడాయించారు. 

చోరీకి గురైన బంగారం విలువ 24 మిలియన్ (రూ.184 కోట్లు) యూరోలు కాగా.. బంగారంతో పాటు ఓ ఎయిర్‌ పోర్టు సీనియర్‌ అధికారిని కిడ్నాప్‌ చేసి.. బంగారం తరలింపు విషయాన్ని రాబట్టారు. తర్వాత ఇద్దరు ఎయిర్‌ పోర్టు అధికారులను బంధించి విమానాశ్రయంలోకి ఎంటరయ్యారు. తుపాకీతో పాటు నలుగురు ఎయిర్‌ పోర్టులోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలస్యంగా గ్రహించిన కస్టమ్స్‌, పోలీసు అధికారులు.. నిందితులను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు.