కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించింది. యూఎస్, యూరప్ దేశాల్లో ఈ వైరస్ విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ఇంకా ప్రవేశించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారి కేసులు ఇంకా ఖాతా తెరవని దేశాల జాబితాను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Coronavirus) ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. రెండేళ్లకుపైగా ఈ మహమ్మారి ఇంకా కొత్త కొత్త రూపాలతో మళ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఒరిజినల్ వైరస్‌తోపాటు డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇప్పటికీ ప్రతి రోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. కాగా, రోజూ వేలాది మంది పేషెంట్లు ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం ప్రస్తుతం కరోనా పరిస్థితులు అమెరికా, ఐరోపా దేశాల్లో ఇప్పటికీ క్లిష్టంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ఎంటర్(Zero Cases) కాలేదు. ఔను.. ఈ మహమ్మారి టచ్ చేయలేకపోయిన దేశాలు ఇంకా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ జాబితా పెద్దగానే ఉన్నది.
కరోనా మహమ్మారి ప్రవేశించని దేశాలు సుమారు పది వరకు ఉన్నాయి. అయితే, అందులో మెజార్టీగా మహాసముద్రాల్లోని దీవులే కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితం ఈ జాబితా ఇంకాస్త పెద్దగానే ఉండేది. కానీ, టోంగా దీవిలో భారీ అగ్నిపర్వతం పేలడంతో సహాయక చర్యల కోసం అక్కడికి వేరే దేశాల పడవలు చేరాయి. ఆ సహాయక చర్యల కారణంగా ఇతర దేశాల నుంచి వైరస్ టోంగా దీవికి చేరుకుంది. అదే విధంగా కుక్ దీవిలోనూ గత వారమే తొలిసారి కరోనా కేసు నమోదైంది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ఇప్పటికీ కరోనా వైరస్ ఎంటర్ కాని దేశాలు జాబితా ఇలా ఉన్నది.
తువాలు: కామన్‌వెల్త్ సభ్యత్వం ఉన్న దీవి తువాలు. ఈ దీవి సరిహద్దులు మూసే ఉన్నాయి. క్వారంటైన్ తప్పనిసరి నిబంధన అమలు చేస్తున్నారు. ఈ దీవుల్లో ప్రతి 100 మందికి 50కి రెండు డోసుల టీకా వేశారు.
టోకెలౌ: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని చిన్ని దీవి సముదాయం టోకెలౌ. ఇందులో ఇప్పటికీ కరోనా లేదు. న్యూజిలాండ్ సమీపంలో ఉన్న ఈ దీవి సముదాయంలో ఒక్క విమానాశ్రయమే ఉన్నది. ఈ దీవి సముదాయంలో 1,500 మంది జనాభా ఉన్నది.
సెయింట్ హెలెనా: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటీష్ ఓవర్సీస్ టెర్రిటరీ సెయింట్ హెలెనా. ఇక్కడ 58.16 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు.
పిట్‌కెయిర్న్ దీవులు: పసిఫిక్ సముద్రంలోని ఈ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1606లో యూరోపియన్లు తొలిసారిగా కనుగొన్నప్పుడు అక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ దీవుల్లో పాలినేషియన్లు జీవిస్తున్నారని సీఐఏ రికార్డులు చెబుతున్నాయి. ఈ దీవుల్లో 74 శాతం ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
నియూ: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నియూ దీవి ఉన్నది. ఈ దేశంలోకీ ఇప్పటికీ కరోనా ఎంటర్ కాలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ దీవిలో 79 శాతం మంది ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని వివరించింది.
నౌరు: ఆస్ట్రేలియాకు ఈశాన్యం వైపున ఈ చిన్ని దేశం నౌరు ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధంలో జపనీస్ ఈ దేశాన్ని ఔట్‌పోస్టుగా వాడుకుంది. ఇక్కడ 68 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకా తీసుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మైక్రోనేషియా: ఈ దేశంలో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశంలో 38.37 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ దేశంలోనూ కరోనా కేసు రిపోర్ట్ కాలేదు.
ఈ దేశాలతోపాటు తుర్క్‌మెనిస్తాన్, ఉత్తర కొరియా దేశాల్లోనూ ఇప్పటికీ ఒక్క కేసు రిపోర్ట్ కాలేదు. అయితే, అధికారికంగా కేసు ప్రకటించలేదు. కానీ, అనధికారికంగా కేసులు ఉండే అవకాశం ఉన్నదనే వాదనలు ఉన్నాయి.
