ఆప్ ఒక బూటకపు పార్టీ.. కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు: బీజేపీ
New Delhi: ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్ పై పాకిస్తాన్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ మౌనం వహించడంపై ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవా స్పందిస్తూ.. ఆప్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఒక బూటకపు పార్టీ అంటూ విమర్శించారు.

Delhi BJP: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆప్ ఒక బూటకపు పార్టీ అని విమర్శిస్తూ.. అరవింద్ కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ బీజేపీ ఆదివారం ఆప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిది. ఆప్ బూటకపు పార్టీ అని ఆరోపించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయవాదం ముసుగులో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ, కేజ్రీవాల్ జాతీయవాదాన్ని పెంచుతున్నారని, అయితే ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్‌పై పాకిస్తాన్ చేసిన అసభ్యకరమైన-అవమానకరమైన వ్యాఖ్యలపై ఆయన మౌనం వహించడం రాజకీయ ప్రేరణ చర్యగా పేర్కొన్నారు. కేజ్రీవాల్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమంటూ విమర్శించారు.
సచ్‌దేవా మాట్లాడుతూ.. ఆప్‌కి జాతీయ పార్టీ హోదా లభించడాన్ని కేజ్రీవాల్ తమ పార్టీ సాధించిన ప్రత్యేక విజయంగా అభివర్ణించారు. అయితే నిజమేమిటంటే స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన రాజకీయ పార్టీల్లో దేశంలో జాతీయ పార్టీగా అవతరించిన ఏకైక పార్టీ బీజేపీయేనని ఆయన అన్నారు. "బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ స్థాపించిన కొన్ని సంవత్సరాలలో జాతీయ పార్టీ హోదాను పొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడానికి 10 సంవత్సరాలు పట్టింది" అని బీజేపీ నేత అన్నారు.
జాతీయవాదం గురించి పెద్దగా మాట్లాడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తన పార్టీ జాతీయ సదస్సులో అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై పాకిస్థాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మౌనం వహిస్తున్నప్పుడు, ఆయన జాతీయవాదం ఎంత పొత్తులో ఉందో అర్థమవుతుందని సచ్‌దేవా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఆదివారం విమర్శల దాడిని కొనసాగించారు. దేశ సైనికుల పట్ల కొంత ధైర్యం-గౌరవం చూపించాలని ఆయన కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సరిహద్దులో చైనా దూకుడు పెరుగుతుండగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అంతా బాగానే ఉందని చెబుతోందని ఎద్దేవా చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఇటీవల భారత సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు సాగుతున్న క్రమంలో.. భారత్-చైనా సైనికుల ఘర్షణ తర్వాత కూడా చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్నందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే, చైనాతో మోడీ సర్కారు వ్యవహరించే తీరుపై మండిపడ్డారు. చైనా వస్తువులను బహిష్కరించండని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2020-21లో చైనా నుండి 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయని, 2021-22లో 95 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుందని అన్నారు. ఆ దిగుమతులను ఆపే రోజు చైనా గుణపాఠం నేర్చుకుంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చైనా నుండి దిగుమతులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. బొమ్మలు, చెప్పులు,బట్టలు వంటి అనేక వస్తువులు చైనా నుండి దిగుమతి అవుతున్నాయనీ, ఈ వస్తువులను మన దేశంలో కూడా తయారు చేసుకోవచ్చని అన్నారు. “ఇది 21వ శతాబ్దం, ఏ దేశమూ మరొక దేశ భూభాగాన్ని స్వాధీనం చేసుకోదు. ఆధునిక ప్రపంచంలో, ఇది వాణిజ్యం-ఆర్థిక శాస్త్రం గురించి. మనం కొంత ధైర్యం చూపించి, ఈ $95-బిలియన్ల దిగుమతిని ఆపిన రోజు, చైనా దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటుంది”అని శ్రీ కేజ్రీవాల్ అన్నారు. భారతదేశం తయారీ కేంద్రంగా మారడానికి కేంద్ర ప్రభుత్వం అనువైన వాతావరణాన్ని కల్పించడం లేదనీ, దీని కారణంగా అధిక నికర విలువ కలిగిన భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్తున్నారని విమర్శించారు.