ఓ వ్యక్తి సూటు బూటు ధరించి 23 అంతస్తుల భవనం మీది కిటికీలపై నుంచి సునాయసంగా జంప్ చేసుకుంటూ వెళ్లాడు. హాలీవుడ్ స్టంట్ తరహాలో కనిపిస్తున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ సినిమాలో విలన్ తరహాలో ఉన్న ఓ వ్యక్తి బ్లాక్ సూట్ ధరించి సునాయసంగా పరుగెత్తడం ఓ వైరల్ వీడియోలో కనిపిస్తున్నది. ఆ వీడియోను కొంత పరిశీలించి చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ఆయన 23 అంతస్తుల భవనం పైన గల కిటికీల పై నుంచి సునాయసంగా దూకుతూ వెళ్లుతున్నాడు. ఆ బిల్డింగ్ న్యూయార్క్‌లోనిది. సుమారు 115 ఏళ్ల పురాతనమైన బిల్డింగ్ అది. ఆయన జంకు గొంకు లేకుండా 23 అంతస్తుల భవనానికి వెలుపల వైపున కిటికీల పై భాగం నుంచి చిన్నగా దూకుతూ వెళ్లిపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ప్రముఖ దర్శకుడు, ఎమ్మీ అవార్డు గ్రహీత ఎరిక్ ల్జుంగ్ అతడి వీడియో తీసి పోస్టు చేశారు. ఈ పోస్టుతో పాటు ఆయన ఓ వ్యాఖ్యను జోడించారు.
‘ఈ వీడియో పై ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి.. అసలు అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో నాకు కూడా తెలియదు. ఆ వీడియోలో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు ఆయన ఆ కిటికీల మీదుగా వచ్చాడు. సరిగ్గా ఆ మూల మీదికి వచ్చిన తర్వాత కాసేపు ఆగాడు. అక్కడ కాసేపు ఆగి వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తున్నది. నాకు తెలిసి ఓ ఫోన్ కాల్ చేసినట్టు ఉన్నాడు. చుట్టూ చూశాడు. ఒక నిమిషం తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి ఆయన బయల్దేరి వచ్చిన చోటుకే వెనుదిరిగాడు. అక్కడ ఓ కిటికీ మీద ఆగి వెంటిలేటర్ తరహాలో ఉన్న ఓ విండో గ్లాస్ ఓపెన్ చేసి లోనికి వెళ్లిపోయాడు. మేమంతా అలాగే చూస్తూ ఉండిపోయాం. 911 స్మారకానికి కుడి వైపున వెస్ట్ సెయింట్ దగ్గర ఈ బిల్డింగ్ ఉన్నది’ అని ఆయన వివరించారు.
ఈ వీడియోపై కామెంట్లు చాలా వచ్చాయి. నాకు తెలిసి ఆయన ఓ స్టంట్ మ్యాన్ అయి ఉంటాడని, ఈ స్పాట్ సినిమాలో తీయవచ్చా? లేదా? అని చూసినట్టు ఉన్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
