కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఎటునుంచి ఎవరికి ఈ వైరస్ సోకుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా.. ఓ పెళ్లి వేడుక కారణంగా 176మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వారిలో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. విచిత్రం ఏమిటంటే.. పెళ్లికి వెళ్లి వచ్చిన వారిద్వారా 176మందికి కరోనా సోకింది. కాగా.. చనిపోయిన ఏడుగురు అసలు ఆ పెళ్లికి వెళ్లనేలేదు. ఈ విషాద సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ‌స్టు 7న సెంట్రల్ మైనేలోని మిల్లినోకెట్‌లో ఓ పెళ్లి వేడుక జ‌రిగింది. దీనికి 65 మంది అతిథులు హాజ‌ర‌య్యారు. ఇండోర్‌ వేడుకుల‌కు 50 మందికి మించి అతిథులు హాజ‌రు కావ‌ద్ద‌న్న నిబంధ‌న‌ను పెళ్లి వారు ఈ సంద‌ర్భంగా అతిక్ర‌మించడం జ‌రిగింది.

ఇక‌ ఈ వేడుక ద్వారా ఏకంగా 100 మైల్స్(సుమారు 160 కిలోమీట‌ర్లు) దూరంలో గ‌ల మాడిసన్ వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందడం గ‌మ‌నార్హం. ఇలా పెళ్లికి వ‌చ్చిన వారి ద్వారా ఇత‌రుల‌కు వ్యాప్తి చెందడంతో మొత్తం 176 మంది కొవిడ్ బారిన ప‌డ్డారు. దీంతో ఈ వేడుక క‌రోనా‌ సూప‌ర్ స్ప్రెడ‌ర్‌గా మారింది. ఇక క‌రోనాతో చనిపోయిన ఏడుగురు అస‌లు ఈ పెళ్లికి కూడా హాజ‌రు కాలేద‌ని మైనే వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాల డైరెక్టర్ నీరవ్ షా తెలిపారు. కేవ‌లం సెకండ‌రీ స్ప్రెడ్ కారణంగా వీరు మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా  కరోనా కేసుల్లో అమెరికానే మొదటి స్థానంలో ఉంది. మరణాలు సైతం అత్యధికంగా అక్కడే నమోదు కావడం గమనార్హం.