ఓ అలవాటు 66మంది ప్రాణాలు తీసింది. సిగరెట్ తాగాలనే కోరిక అదీ.. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు.. పైలెట్ కు కలగడం.. ఆ విమానంలోని 66 మందిని సజీవజలసమాధి అయ్యేలా చేసింది. 2016లో జరిగిన ఓ విమానప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

ఈజిప్ట్ : ఆరేళ్ల క్రితం Egypt ఎయిర్ విమానయాన సంస్థలకు చెందిన ఓ విమానం సముద్రంలో కూలిపోయి 66 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. pilot సిగరెట్ అంటించడం వల్ల cockpitలో మంటలు చెలరేగి కుప్పకూలినట్లు దర్యాప్తులో వెల్లడయింది.

విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ఇందుకు సంబంధించిన 134 పేజీల నివేదికను గతనెల ప్యారిస్లోని అప్పీల్ కోర్టులో సమర్పించారు. ఈ వివరాలపై తాజాగా న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. కాక్ పిట్ లో ఉన్న పైలెట్ cigarette వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. ఫలితంగా కాసేపట్లో మంటలు చెలరేగి విమానం కూలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. ఘటన సమయంలో కాక్ పిట్ సిబ్బంది అరుస్తున్న శబ్దాలు మాస్క్ కు ఉన్న మైక్రో ఫోన్ లో రికార్డు అయినట్లు దర్యాప్తులో తేలింది.

2016 మే నెలలో ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థలకు చెందిన ఎయిర్ బస్ ఏ320 విమానం ఒకటి ప్రమాదానికి గురయింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో బయలుదేరిన ఈ విమానం గ్రీకు ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. కాసేపటికి క్రెటె ద్వీపం సమీపంలోని తూర్పు మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది.

ప్రమాదం సమయంలో విమానంలో సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 40 మంది ఈజిప్షియన్లు, 15 మంది ఫ్యాన్స్ జాతీయులతో పాటు ఇతర దేశాలవారు ఉన్నారు. ఘటన తర్వాత భారీ గాలింపు చేపట్టగా సముద్రగర్భంలో విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తొలుత దీన్ని ఉగ్రదాడిగా అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర ముఠా ప్రకటనలు చేయలేదు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 7న Costa Ricaలో ఓ Cargo plane అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం కారణంగా సాన్ జోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం DHL కు చెందిన పసుపురంగు విమానం నుండి ముందుగా పొగలు వెలువడ్డాయి. ఆ తరువాత అది ఆగిపోయింది. వెనుక చక్రాల మీదుగా గుండ్రంగా తిరుగుతూ రెండుగా విడిపోయింది. అదే సమయంలో రన్‌వే నుండి పక్కకు జారిపోయింది.

ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది బాగానే ఉన్నారని కోస్టా రికా అగ్నిమాపక సిబ్బంది చీఫ్ హెక్టర్ చావెస్ చెప్పారు. అయినా కూడా ముందుజాగ్రత్తగా ఈ గ్వాటెమాలన్ జంటను "వైద్య పరీక్షల కోసం" ఆసుపత్రికి పంపించారని రెడ్‌క్రాస్ ఉద్యోగి గైడో వాస్క్వెజ్ అన్నారు. ఈ ప్రమాదంలో పైలట్ షేక్ అయ్యాడు. కానీ సిబ్బంది ఇద్దరూ స్పృహలోనే ఉన్నారు అని వాస్క్వెజ్ చెప్పుకొచ్చారు. 

శాన్ జోస్ వెలుపల ఉన్న జువాన్ శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన బోయింగ్-757 విమానం, సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ కోసం 25 నిమిషాల తర్వాత తిరిగి రావాల్సి రావడంతో ఉదయం 10:30 గంటలకు (1630 GMT) ఈ ప్రమాదం జరిగింది. అయితే, విమానంలో హైడ్రాలిక్ సమస్యపై సిబ్బంది స్థానిక అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేశారు.