మహ్సా అమిని స్వస్థలం వద్ద సంతాపం వ్యక్తం చేస్తున్న వారిపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో కనీసం ఎనిమిది మంది హిజాబ్ వ్యతిరేక నిరసనకారులు మరణించారు.

ఇరాన్ : ఇరాన్ తో హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలపై ప్రభుత్వ అణిచివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ భద్రతా దళాలు బుధవారం రాత్రి నుంచి కనీసం ఎనిమిది మంది నిరసనకారులను హతమార్చారు. మానవ హక్కుల మీద పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం, భద్రతా దళాలు సంతాపకులు, నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారు.

"ఇరాన్ భద్రతా దళాలు బుదవారం రాత్రి నుంచి జరిపిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది చనిపోయారు. వీరంతా హిజాబ్ వ్యతిరేక నిరసనకారులు, వారి సానుభూతిపరులు’ అని అమ్నెస్టీ గురువారం తెలిపింది. మానవ హక్కుల NGO కూడా "నిర్లక్ష్యంగా, చట్టవిరుద్ధంగా తుపాకీలను ఉపయోగించడం"ని ఖండించింది.

మహ్సా అమినీ మరణించి 40 రోజులైన సందర్భంగా బుధవారం ఆమె స్వగ్రామంలో నిరసనకారులు వేలాదిగా కవాతు నిర్వహించారు. దీనిమీద ఇరాన్ భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. కుర్దిష్ మూలానికి చెందిన 22 ఏళ్ల ఇరానియన్ అమినీ, మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను వ్యతిరేకించింది. వారి ఆంక్షలను ఉల్లంఘించింది. దీనికి గానూ మోరాలిటీ పోలీసులు టెహ్రాన్‌లో ఆమెను అరెస్టు చేశారు. ఆ తరువాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న ఆమె మరణించారు.

ఒంటిపై దుస్తులను తొలగించి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలకు నటి మద్దతు.. నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదని కామెంట్

ఆమె మరణంతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలు 2019లో జరిగిన గ్యాసోలిన్ ధరల పెరుగుదలపై నిరసన ప్రదర్శనల తర్వాత ఇదే అతిపెద్దది. ఈ నిరసనలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారు. వారు తమ హిజాబ్ లను ఊపుతూ, వాటిని తగులబెట్టి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొందరు బహిరంగంగా జుట్టును కత్తిరించుకున్నారు.

అయితే, మహ్సా అమినీ మరణంపై ఆగ్రహావేశాలు చెలరేగడానికి తద్వారా దేశవ్యాప్తంగా అశాంతి రగలడానికి అమెరికా, ఇజ్రాయెల్ లే రెచ్చగొట్టాయని ఇరాన్ ముఖ్య నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. ఇటీవల, నిరసనకారులు వారి హిజాబ్‌లను చింపి, వాహనాలకు నిప్పుపెట్టే దృశ్యాలను "సాధారణం కాని, అసహజమైన చర్యలు" అని ఖమేనీ ఖండించారు. "ఇస్లామిక్ రిపబ్లిక్‌ను విధ్వంసం చేయడానికి అశాంతిని రేకెత్తించే వారు కఠినమైన విచారణ, శిక్షకు అర్హులు" అని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌లో చివరిసారిగా అతిపెద్ద నిరసన, 'బ్లడీ నవంబర్' అని పిలవబడే నిరసన 2019లో ప్రారంభమైంది. ఇది ఇంధన ధరలలో 50 శాతం -200 శాతం పెరుగుదల తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. 

Scroll to load tweet…