కరోనా సోకకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్, శానిటేషన్... కరోనా జాగ్రత్తలే కీలకం. అంతకుమించి ఏ అపోహల్నీ నమ్మవద్దు. ఆవు మూత్రం తాగితే కరోనా రాదంటూ జరిగిన ప్రచారం మనకందరికీ తెలిసిందే.. దీంతో చాలామంది దానికి ఎగబడ్డారు. 

కరోనా ప్రపంచాన్నంతా కుదిపేస్తుంది.. సో అపోహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఓ మాతాజి కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదంటూ... తాగి మరణించింది. ఈ ఘటన వాషింగ్టన్ లో జరిగింది. 

అయితే మూఢభక్తిలో మునిగిన ఆమె శిష్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఓ బట్టలో చుట్టి.. చుట్టూ లైట్స్ తో డెకరేషన్ చేసి పూజిస్తున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నపోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిష్యులను అరెస్ట్ చేశారు.

కొలరాడోలో జరిగిన ఈ వింత సంఘటన వివరాల్లోకి వెడితే.. అమి కార్లసన్ (45) అనే మహిళ ‘లవ్ హాస్ ఓన్’ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులందరూ ఆమెను ‘‘మదర్‌ ఆఫ్‌ గాడ్‌’’ అని పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10మంది వరకు శిష్యులున్నారు. కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంది. దాని చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించి.. ఆమె గురించి భజనలు, పాటలు పాడుతూ కూర్చుని కనిపించారు.  

అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. 

కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కార్లసన్ 2018లో ‘లవ్ హాస్ ఓన్’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించింది. ఆమెను దాదాపు లక్షన్నర మంది శిష్యులుగా మారారు. వీరంతా కార్లసన్ దాదాపు 19 బిలియన్ సంవత్సరాలుగా మానవత్వాన్ని కాపాడటం కోసం శ్రమిస్తుందని... ఏదో ఒక రోజు ఆమె తన శిష్యులను కొత్త లోకానికి తీసుకువెళ్లుందని నమ్ముతారు. అంతేకాదు పూర్వజన్మలో డొనాల్డ్ ట్రంప్ కార్లసన్ తండ్రి అని ఆమె శిష్యులు నమ్ముతున్నారు.