ఉక్రెయిన్‌లోని రైల్వే స్టేషన్‌పై రష్యా రెండు రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 39 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 100 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలోని క్రమటోర్స్క్ నగరంలోని రైల్వే స్టేషన్‌పై ఈ దాడి జరిగింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని తూర్పు భాగంలో రష్యా ఒక్కసారిగా విరుచుకుపడింది. క్రమటోర్స్క్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌పై రాకెట్లతో దాడి చేసింది. క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌ను రెండు రష్యన్ రాకెట్లు పేల్చేశాయి. ఈ ఘటనలో 30 మంది మరణించినట్టు ప్రభుత్వ రైల్వే కంపెనీ వెల్లడించింది. కానీ, సహాయక చర్యలు మొదలుపెట్టిన తర్వాత ఈ సంఖ్య పెరుగుతూ వెళ్లింది. అక్కడ 39 మంది మరణించినట్టు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న సిబ్బంది తెలిపారు. కాగా, 100 మంది గాయపడ్డారు.
క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌ను రెండు రాకెట్లు పేల్చేశాయని ఉక్రెయినియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆపరేషనల్ డేటా ప్రకారం, 30 కిపైగా మంది అక్కడ చనిపోయారని తెలిపింది. అలాగే, మరో 100 మంది వరకు గాయపడ్డారని వివరించింది. రాకెట్లు దాడి చేసే సమయంలో ఆ రైల్వే స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు ఉన్నట్టు దొనెత్స్క్ రీజియన్ గవర్నర్ పావ్‌లో కిరిలెంకో వెల్లడించారు. ఈ ఘటనపై రష్యా ఇంకా స్పందించలేదు. గత నెల 24న ఉక్రెయిన్‌పై రష్యా ‘మిలిటరీ ఆపరేషన్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాము సాధారణ పౌరులకు హాని తలపెట్టబోమని అప్పుడే రష్యా తెలిపింది. తమ లక్ష్యం కేవలం ఉక్రెయిన్‌లో పెరుగుతున్న మిలిటరీ స్థావరాలేనని పేర్కొంది.
రాకెట్ దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ రష్యాను హద్దులు లేని రాక్షసిగా పేర్కొన్నారు. నాగరిక ప్రజలను రాక్షస రష్యా చంపేస్తున్నదని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ఈ ఏరియాలో రష్యా దాడులు పెరిగే అవకాశం ఉన్నదన్న సంకేతాల నడుమ చాలా మంది అక్కడి నుంచి తరలి వెళ్లిపోతున్నారు. అయితే, ఆ తరలింపులు ప్రధానంగా రైల్వే స్టేషన్ల గుండా జరుగుతున్నది. ప్రస్తుతం రష్యా దాడి చేసిన రైల్వే స్టేషన్ కూడా ఉక్రెయిన్ పౌరుల తరలింపు కోసం వినియోగిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియ జరుగుతున్న రైల్వే స్టేషన్‌పైనే రష్యా రెండు రాకెట్లతో దాడి చేయడం గమనార్హం. దొన్‌బాస్ రీజియన్‌లో రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి చివరి అవకాశం ఇదేనని పేర్కొంటూ చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.
రష్యా గతంలో ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అయితే, దాన్ని ఉక్రెయిన్ గుండా రష్యా యాక్సెస్ చేయలేదు. కాబట్టి, ఇప్పుడు డీపీఆర్, ఎల్పీఆర్‌ల గుండా ఆ క్రిమియా ప్రాంతాన్ని కలిపే మిగిలిన ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే రష్యా మద్దతు ఉన్న పై రెండు ప్రాంతాలతో చిక్కేమీ లేదు. అలాగే, క్రిమియాను ఎన్నడో తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు పైన పేర్కొన్న రెండు ప్రాంతాల నుంచి క్రిమియాకు ఉక్రెయిన్ భూమి గుండా వెళ్లాలని భావిస్తున్నది. కాబట్టి, ఈ రెండు ‘స్వతంత్ర ప్రాంతాల’ నుంచి క్రిమియాను కలిపేలా మిగిలిన ప్రాంతాలను రష్యా ఆక్రమించుకోవాలని యోచిస్తున్నట్టు ఉక్రెయిన్‌లోని చాలా మంది భావిస్తున్నారు.
