సమయస్ఫూర్తితో ఎంతటి క్లిష్ట సమస్యనుంచైనా బయటపడొచ్చని ఓ యువతి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రియాకు చెందిన నటాలీ బిర్లీ ట్రయాథ్లెట్... ప్రతిరోజులాగే తన సైకిల్‌పై ప్రాక్టీస్ చేస్తోంది.

ఇంతలో హఠాత్తుగా వెనుకనుంచి వచ్చిన ఓ కారు ఆమె సైకిల్‌ను ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. గాయాలు కావడతో రక్తాన్ని తుడుచుకుంటుండగా సదరు కారు డ్రైవర్ కర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు.

స్పృహ తప్పిన ఆమెను కారు వెనుక సీట్లో వేసుకుని ఓ ఇంటిలో బంధించాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమెను బెదిరించి మద్యం తాగాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకు ఆ అమ్మాయి వినకపోవడంతో ముక్కు, నోరు, మూసి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు.

అక్కడితో ఆగకుండా ఆమెను బాత్ డబ్‌లో ముంచాలని లాక్కెళ్లాడు. పరిస్ధితిని అర్ధం చేసుకున్న నటాలీ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని భావించింది. బుర్రకు పదును పెట్టగా... ఆ ఇంట్లో చాలా ఆర్చిడ్ పూల మొక్కలున్నట్లు గ్రహించిన నటాలీ... తనకు ఆ పూలంటే పిచ్చి అంటూ ఆగంతకుడిని మాటల్లోకి దించింది.

ఆ మాటల మాయాజాలంతో ఉన్మాదంతో ఊగిపోయిన దుండగుడు కాస్తా నటాలీ మాయలో పడిపోయాడు. తానొక తోటమాలినని.. తండ్రి చనిపోతే తల్లి మద్యానికి బానిసయ్యిందని తన ప్రియురాలు కూడా మోసం చేసిందని దీంతో సమాజంపై కసి పెరిగిందన్నాడు.

తన దారిలోకి దుండగుడు వచ్చాడని గ్రహించిన నటాలీ.. ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దామని సూచించింది. దీని ప్రకారం తనను వదిలేస్తే అందరికీ ప్రమాదంలో దెబ్బలు తగిలాయని చెబుతానని తెలిపాడు.

దీనికి అంగీకరించిన అతడు స్వయంగా కారులో ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. అయినప్పటికీ నటాలీ మాత్రం ఒప్పందాన్ని పక్కనబెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఖాకీలు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశాడు.