ఇండోనేషియా దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మకస్సర్ జలసంధిలో కార్గో బోట్ ప్రమాదానికి గురైంది. పడవ నీటిలో మునిగిపోవడంతో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టారని అధికారులు తెలిపారు. 

ఇండోనేషియా దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మకస్సర్ జలసంధిలో కార్గో బోట్ ప్రమాదానికి గురైంది. పడవ నీటిలో మునిగిపోవడంతో 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టారని అధికారులు తెలిపారు. మకస్సార్ ఓడరేవు నుంచి పాంగ్​కెప్ రీజెన్సీలోని కల్మాస్ ఐలాండ్​కు వెళ్లాల్సిన ఈ పడవ.. వాతావరణం అనుకూలించక మకస్సర్ జలసంధిలో నీటిలో మునిగిపోయిందని అధికారులు చెప్పారు. పడవ మునిగిపోయిన సమయంలో అందులో మొత్తం 42 మంది ఉన్నారని ప్రావిన్షియల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ హెడ్ జునైది తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో సముద్రంలో ఉన్న రెండు టగ్‌బోట్‌ల ద్వారా కొందరిని రక్షించారు. ఆ తర్వాత రక్షించిన మరికొందరితో కలిసి.. మొత్తంగా 17 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. పడవ మునిగిపోయిన ప్రదేశం గురించి శనివారం తాజా సమాచారం అందిందని.. ఆ ప్రాంతానికి సిబ్బందిని పంపించామని జునైది చెప్పారు. గల్లంతైన ప్రయాణికుల ఆచూకీ కోసం స్థానిక ఫిషింగ్ బోట్లు, ఇండోనేషియా వైమానిక దళం హెలికాప్టర్‌లతో పాటు రెండు మోటర్ బోట్లు, ఒక సెర్చ్ అండ్ రెస్క్యూ బోట్‌లు అన్వేషిస్తున్నాయని తెలిపారు. 

తొలుత మునిగిపోయిన పడవ.. ప్రయాణికులతో వెళ్తున్నదిగా చెప్పబడిందని.. కానీ అందులో నిజం లేదని జునైది చెప్పారు. ప్రమాదానికి గురైన పడవ నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తున్న కార్గో బోట్‌ అని స్పష్టం చేశారు. ఆ పడవలో ఆరుగురు సిబ్బంది, 36 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. 

17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో పడవ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భద్రతా నిబంధనలు సరిగా అమలు కాకపోవడం వల్ల.. ప్రమాదాలు సంభవిస్తుంటాయి.