బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 23 మంది ప్రయాణికులు మరణించారు. మరో 20 నుంచి 30 మంది వరకు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70కి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎక్కువ మంది హిందూ భక్తులే ఉన్నారని తెలిసింది. 

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర పంచగడ్ జిల్లాలో కరటోయా నదిలో ప్రయాణిస్తున్న పడవ బోల్తా కొట్టింది. మహాలయ వేడుకలు చేసుకోవాలని ఆలయానికి బయల్దేరిన హిందూ భక్తులతో ఈ పడవ ప్రయాణిస్తున్నది. ఈ పడవ బోల్తాతో 23 మంది మరణించారు. ఇంకా పదుల సంఖ్యలో ప్రయాణికులు నదిలో గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

70 మందికి పైగా ప్రయాణికులతో ఇంజిన్ ఆధారంగా నడిచే ఓ పడవ బొరొసిషి యూనియన్‌లోని బొదేశారి హిందూ ఆలయం కోసం బయల్దేరింది. ఈ పడవలోని చాలా మంది ప్రయాణికులు హిందూ భక్తులు. వారు మహాలయ వేడుకలను ఆ ఆలయంలో వేడుకగా చేసుకోవాలని బయల్దేరారు. కానీ, ఆ పడవ అవాలియా ఘాట్ వద్దకు చేరుకున్న తర్వాత ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది.

ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సుమారు 23 మంది మృతదేహాలను వెలికి తీయగలిగారు. ఇందులో మహిళలు, పిల్లలూ ఉన్నారని పంచ్‌గడ్‌లోని బోడా పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి సుజోయ్ కుమార్ రాయ్ తెలిపారు. కాగా, మరో 20 నుంచి 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని పంచగడ్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ జహ్రూల్ ఇస్లాం వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

Scroll to load tweet…

కచ్చితంగా ఎంతమంది గల్లంతయ్యారనే విషయంపై స్పష్టత లేదని ఇస్లాం తెలిపినట్టు పర్దా ఫాస్ అనే మీడియా వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.. అయితే, ఆ పడవలో సుమారు 70 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు కొందరు ప్రయాణికులు తెలిపారని వివరించారు.

బంగ్లాదేశ్‌లో తరుచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులోనే ఉండే ఈ దేశంలో పడవ ప్రయాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, అందుకు తగ్గట్టు భద్రతా ప్రమాణాలు లేకపోవడం గమనార్హం. మే నెలలో పద్మ నదిలో ఓ పడవ ప్రమాదంలో 26 మంది మరణించారు. వేగంగా వెళ్లే స్పీడ్ బోట్ ఓ పెద్ద బోట్‌ను ఢీకొట్టింది.