భీకర యుద్ధం.. ఇజ్రాయెల్ లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయలు..
ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది భారతీయ పౌరులు వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు వారికి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నివేదించబడలేదు. చిక్కుకుపోయిన భారతీయ పర్యాటకులు తమను బయటకు తీసుకురావాలని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. వరుస దాడులతో ఇరుదేశాల్లో పరిస్థితులు భయాంకరంగా మారాయి. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో ఉగ్రవాద సంస్థ హమాస్ మిలిటెంట్ల దాడులు చేయగా.. వాటిని తిప్పి కొట్టేందుకు వివాదాస్పద గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు ప్రతిదాడులు చేస్తున్నాయి. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలే కాదు. విదేశీ పర్యటకులు కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.
కాగా.. దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రయత్నిస్తుండగా.. రహదారులపైనే చిక్కుకుపోయారు. వీరిలో చాలా మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. వారందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
దీంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న అనేక మంది భారతీయుల్లో రాజ్యసభ ఎంపీ డాక్టర్ వాన్‌వీరోయ్ ఖర్లూఖీ, ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారని వర్గాలు తెలిపాయి. మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) సీనియర్ సభ్యుడు డాక్టర్ ఖర్లూఖీ.. తీర్థయాత్ర కోసం జెరూసలేం వెళ్లారు. ఈ క్రమంలో ఆయన బెత్లెహెమ్‌లో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ కుటుంబంలో మరో 24 మంది భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్‌పిపి చీఫ్ కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ.. ఖర్లూఖీ క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా.. తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్‌లో దాదాపు 85,000 మంది భారతీయ మూలాలున్న యూదులు ఉన్నారు. భారతదేశం నుండి ఇజ్రాయెల్‌కు వలసలు 1950 -1960 లలో ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో మిజోరాం, మణిపూర్ నుండి యూదుల వలసలు మళ్లీ పెరిగాయి.
అప్రమత్తంగా ఉండాలి- భారత రాయబార కార్యాలయం
ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని , స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన కదలికలను నివారించండని సూచించింది. మరోవైపు.. ఇజ్రాయెల్, పాలస్తీనాలోని భారత రాయబార కార్యాలయాలు అక్కడ నివసిస్తున్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలని కోరాయి. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని కూడా సూచించాయి.
మీడియా నివేదికల ప్రకారం.. సైనికులతో సహా కనీసం 600 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. గత 50 ఏళ్లలో దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార దాడిలో గాజా స్ట్రిప్‌లో సుమారు 300 మంది మరణించారు, సుమారు 1,500 మంది గాయపడ్డారు.