కాబుల్‌ : వరుస ఆత్మాహూతి దాడులతో ఆఫ్గానిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. మంగళవారం కాబుల్‌ సమీపంలోని జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీని టార్గెట్ గా చేసుకున్న గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడి ఉగ్రవాదుల పనేనని పోలీసులు భావిస్తున్నారు.

క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 30 మందిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఆఫ్గానిస్తాన్‌లో అక్టోబర్‌ 20న దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌, జిల్లా కౌన్సిల్స్‌కు ఎన్నికలు జరుగునున్నాయి.  

ఆఫ్గానిస్థాన్ లో 33 ప్రావిన్స్‌లకు, 249 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటి కోసం పోటీలో 2691 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఆఫ్గాన్‌లో ఉగ్రవాదులు ప్రజా ప్రతినిధులను, అధికారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 50 మందిపైగా మృతిచెందారు. మరణించిన వారిలో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు అధికారులు సైతం ఉన్నారు.