అభం శుభం తెలియని చిన్నారులను కిడ్నాప్ చేసి.. వారి అవయవాలను అమ్మేసుకొంటున్నారు. ఈ దారుణ సంఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజోంబీ జిల్లాలో గత ఏడాది డిసెంబర్ లో పది మంది చిన్నారులు కిడ్నాప్ కి గురయ్యారు. తమ పిల్లలు కనిపించడం లేదంటూ.. ఆ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. పిల్లలు కిడ్నాప్ అయిన దాదాపు నెల రోజుల తర్వాత వారి మృతదేహాలు లభించినట్లు అధికారులు గుర్తించారు. కాగా.. ఆ చిన్నారుల శరీరంలో అవయవాలు మాత్రం మిస్సయ్యాయని వారు తెలిపారు.  కేవలం అవయవాల కోసం దాదాపు 7ఏళ్ల వయసుగల చిన్నారులను టార్గెట్ చేసుకొని.. వారిని కిడ్నాప్ చేసి.. అవయవాలను కాజేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.

శరీరంలోని ముఖ్య అవయవాలతోపాటు.. పళ్లను కూడా తీసుకొని వెళ్లడం గమనార్హం. ఈ ఘటనను ఆ దేశ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.