Asianet News TeluguAsianet News Telugu

అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు..మహిళ మృతి

ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధ్రువీకరణణ ప్రక్రియ ఆటంకం కలిగింది. దీంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 

1 shot dead in violence at US Capitol: All you need to know
Author
Hyderabad, First Published Jan 7, 2021, 8:37 AM IST

అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య  ఘర్షణలో ఆమె మెడపై తూటా గాయమైంది. దీంతో.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. అయితే.. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ.. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకు వచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను సైతం ప్రయోగించారు.

ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధ్రువీకరణణ ప్రక్రియ ఆటంకం కలిగింది. దీంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలను రంగంలోకి దించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. క్యాపిటల్ భవనంలో అందరూ సంయమనం పాటించాలంటూ ట్రంప్ హితవు పలికారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 

ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్ భవనం విడిచి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ స్పందించారు. ఈ చర్యను ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్ వెంటనే జాతీయ ఛచానెల్ లో ప్రకటన చేయాలని బైడెన్ ట్వీట్ చేశారు. మరో వైపు వాషింగ్టన్ మేయర్ బౌజర్ నగరంలో  కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ  చేశారు. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్ భవనంలను తమ అధీనంలో తీసుకున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios