అపార్ట్ మెంట్ పై ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పీపర్ పీఏ-28 నంబరు గల చిన్న విమానం ఛాంబ్లీ నగరంలోని డెకల్బ్ పీచట్రీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ అపార్టుమెంటుపై కుప్పకూలింది. వాతావరణం అనుకూలించక పోవడంతోపాటు మబ్బులు కమ్ముకోవడంతో చిన్న విమానం ఎగురుతూ కూలిపోయిందని ఫెడరల్ ఏవీయేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికార ప్రతినిధి కత్లీన్ బెర్గెన్ చెప్పారు.

 ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు  చెబుతున్నారు. ఎంతమంది మరణించారనేది ఇంకా క్లారిటీ రాలేదు.  అట్లాంటా పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చారు.కూలిపోయిన పీపర్ పీఏ -28 బుల్లి విమానం సింగిల్ ఇంజన్ తో ఉందని వైమానిక శాఖ అధికారులు చెప్పారు.

ఇలాంటి సంఘటనలు అమెరికాలో గతంలో కూడా జరిగాయి. కొద్ది రోజుల క్రితం... దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం.. ప్రమాదవశాత్తు ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకే కుప్పకూలిందని చెప్పారు. పొపయన్ నగర శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లల్లో  ఎవరూ లేకపోవడంతో...పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

కాగా...ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు చెప్పారు.