వాషింగ్టన్:  కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

పాకిస్తాన్ ప్రధానమంత్రి  ఇమ్రాన్ ఖాన్  అమెరికా లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో ఇమ్రాన్ ఖాన్  సోమవారం నాడు సమావేశమయ్యారు.

భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని ట్రంప్ ప్రకటించారు. 
కాశ్మీర్ సమస్యపై భారత్, పాకిస్తాన్  చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ట్రంప్ దృష్టికి తెచ్చాడు.

రెండు వారాల క్రితం ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాశ్మీర్ సమస్యపై తనను మధ్యవర్తిత్వం వహించాలని అడిగాడని ట్రంప్ ప్రకటించారు.జీ20 దేశాల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్గ్ ట్రంప్‌తో  ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశం ఈ ఏడాది జూన్ చివరి వారంలో జరిగింది.

ఇదిలా ఉంటే కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోడీ కోరలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ప్రకటించారు.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రవీష్ స్పష్టం చేశారు.  అమెరికా, పాక్ మధ్య  టెన్షన్ వాతావరణం నెలకొంది.పాక్ కు సెక్యూరిటీ సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. 2018లో అమెరికా పాక్ కు సెక్యూరిటీ సహాయాన్ని నిలిపివేసింది.