హైదరాబాద్: ఓ మహిళ ప్రియుడితో పెళ్లి కోసం అత్యంత దారణమైన సంఘటనకు పాల్పడింది. ఆమె ఓ ఇంట్లో పని మనిషిగా కుదిరింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆమె తన ఇంటి యజమానురాలిని హత్య చేసింది. 

డబ్బు తెస్తే తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పడంతో ఆమె ఆ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింంది. తూర్పు మండలం డీసీపీ రమేష్ సోమవారంనాడు ఆ వివరాలను వెల్లడించారు. 

హైదరాబాదులోని ఓల్డ్ మలక్ పేట ఎంసీహెచ్ కాలనీకి చెందిన వాసు భార్య దళాయి లక్ష్మి ఉప్పల్ లోని విజయలక్ష్మి హోంకేర్ సర్వీసెస్ ద్వారా కాచిగుడా చప్పల్ బజార్ లోని కమలమ్మ (85) ఇంట్లో కేర్ టేకర్ గా చేరింది. ఈ క్రమంలో ఆమె మందుల మహేందర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు .

అయితే, భార్యకు విడాకులివ్వడానికి డబ్బులు కావాలని, అవి ఇస్తే పెళ్లి చేసుకోవచ్చునని అతను చెప్పాడు. దీంతో డబ్బుల కోసం ఇంటి యజమానురాలిని చంపడానికి లక్ష్మి పథకం వేసింది. కమలమ్మ నిద్రలో ఉండగా ఈ  నెల 10వ తేదీిన ముఖంపై దిండుపెట్టి అదిమిపట్టి చంపేసింది. 

ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్, పది తులాల బంగారు ఆభరణాలు, రూ. 26 వేల నగదు తీసుకుని పారిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు కమలమ్మ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా లక్ష్మిని, ఆమె ప్రియుడు మహేందర్ ను అరెస్టు చేశఆరు. వారి నుంచి బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. 

ఏ విధమైన ఆధారాలు తీసుకోకుండా లక్ష్మిని పనికి కుదిర్చిన విజయలక్ష్మి హోంకేర్ నిర్వాహకుడు సతీశ్ కుమార్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.