హైదరాబాద్: మద్యం సేవించి వేధిస్తున్న భర్తను ఓ మహిళ గొంతు నులిమి హత్య చేసింది. ఆ మహిళను హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా పగుళ్లతండాకుచెందిన పత్తావత్ ప్రసాద్ బాబు (30), సరోజ (27) భార్యాభర్తలు

వారు కొంతకాలం క్రితం పగుళ్లతండా నుంచి హైదరాబాదులోని వనస్థలిపురానికి వచ్చారు. వనస్థలిపురంలోని భవానీ ఎన్ క్లేవ్ వద్ద వారు నివాసం ఉంటూ వచ్చారు. ప్రసాద్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

ప్రసాద్ ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. అతను పెట్టే బాధలు భరించలేక సరోజ తన అన్న లక్ష్మణ్ తో కలిసి గొంతు నులిమి చంపేసింది. గుండెపోటుతో చనిపోయాడంటూ శవాన్ని పగుళ్లతండాకు తరలించారు. 

గొంతుపై కమిలిన గాయాలను గుర్తించిన ప్రసాద్ బంధువులు సరోజను నిలదీశారు. తాను చేసిన పనిని ఆమె వాళ్ల ముందు అంగీకరించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.