హైదరాబాద్ లో ఓ ఆర్టిసి బస్సు నడిరోడ్డుపై నానా బీభత్సం సృష్టించింది. బస్సు మితిమీరిన వేగంతో వచ్చి బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది.

మృతుడు చెంగిచెర్లలో నివాసముండే ఘనశ్యామ్  సాలుంకే గా తెలుస్తుంది. అతడు కోఠి నుండి ఉప్పల్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట సమీపంలోని చేనంబర్  జంక్షన్ వద్దకు రాగానే బస్సు ఇతన్ని ఢీకొట్టగా ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. 

ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ పరారీలో వున్నాడు. ప్రమాదం జరగ్గానే అతడు బస్సు దిగి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆర్టిసి కార్మికులు సమ్మెకు దిగడంతో యాజమాన్యం తాత్కాలిక  సిబ్బందిని నియమించి బస్సులను నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుభవం లేని డ్రైవర్ల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు బయటపడ్డాయి. అలా తాజాగా హైదరాబాద్ లో కూడా తాత్కాలిక డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఓ నిండు ప్రాణం బలయ్యింది.