హైదరాబాద్: ఈసారి వినాయక చవితి సంబరాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. వీధుల్లో గణేషుడి విగ్రహాలను నెలకొల్పకూడదని హైదరాబాదు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 

వీధుల్లో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పవద్దని ఆయన చెప్పారు. ఇళ్లలోనే వినాయకుడి పూజలు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలల్లో గణేశుడి విగ్రహాలను నెలకొల్పకూడదని ఆయన చెప్పారు.

ఇళ్లలోనే గణేశుడి విగ్రహాలు పెట్టుకోవాలని ఆయన చెప్పారు ప్రజలంతా దానికి సహకరించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  హైదరాబాదులో వినాయక చవితి సంబరాలపై కరోనా పెద్ద యెత్తునే దెబ్బ వేసింది.

ఏటా వినాయక చవితి సంబరాలు హైదరాబాదులో ఘనంగా జరిగే విషయం తెలిసిందే. ఖైరతాబాదులో స్థాపించే విగ్రహం ఏటా తన విశిష్టతను చాటుతూ వస్తోంది. వినాయక చవితి రోజు బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటు పూజాధికాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. తొమ్మిదవ రోజును విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. హైదరాబాదులో చార్మినార్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పెద్ద యెత్తున ఊరేగింపు జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి దానికి కరోనా ఆటంకంగా నిలించింది.