హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణ సంఘటన జరిగింది. హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన సహోద్యోగిని పట్ల దారుణంగా వ్యవహరించి, ఆ తర్వాత హత్య చేశాడు. 

ఎల్బీనగర్ లోని జనప్రియ కాలనీలో గల ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్ ఉద్యోగిని హేమలతను సహోద్యోగి హత్య చేశాడు. నిందితుడుని వెంకటేశ్వర రావుగా గుర్తించారు. 

శనివారం రాత్రి సహోద్యోగిని హేమలతపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమె విషయాన్ని ఇతరులకు చెబుతుందని భయపడిన వెంకటేశ్వర రావు హేమలత మెడకు చున్నీ బిగించాడు. దాంతో ఆమె ఊపిరాడక మరణించింది. 

దాన్ని గమనించిన స్థానికులు వెంకటేశ్వర రావును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.