హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసి) ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం చెర్లపల్లి డివిజన్ కు వెళ్లారు. 

వరద సాయం పంపిణీ చేయడానికి ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ప్రజలు ఆయన నిలదీశారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత కాలం తమ వద్దకు ఎందుకు రాలేదని మేయర్ ను స్థానికులు ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా తమ వద్దకు రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తున్నారని ఆయనను అడిగారు. 

తమ డివిజన్ లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని వారు అడిగారు. వరద సాయం కూడా తమకు సరిగా అందలేదని వారు చెప్పారు.  

డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు ప్రజలు తమ నుంచి జారిపోకుండా చూసుకోవడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం ఓ ప్రకటన చేశారు. రూ.15 వేల ఆస్తి పన్ను చెల్లించినవారికి యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 

వరద సాయం అందనివారికి మరో ఆవకాశం కల్పిస్తున్నట్లు కూడా తెలిపారు. వరద సాయం కోసం ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరద సాయంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వరద సాయం అందలేదనే విమర్శలు వస్తున్నాయి.