హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భారత ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో వున్న కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలిశారు. ఆయనకు సాదర ఆహ్వానం పలికిన మంత్రి పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. 

తాను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ తో సమావేశమైనట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలతో గత ఆరు సంవత్సరాలలో రాష్ట్రంలో గణనీయ వృద్ది జరిగినట్లు సుబ్రహ్మణ్యన్ కు కేటీఆర్ వివరించారు. 

రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై కూడా వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా వున్న మీరు ఈ విషయంపై కాస్త చొరవ చూపించి తెలంగాణ అభివృద్దికి సహకరించాలని కేటీఆర్ కోరినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాధాన్యతలను సుబ్రమణ్యన్  తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్, సుబ్రహ్మణ్య న్ కు సూచించారు. గతంలో హైదరాబాద్ ఐ యస్ బి లో పనిచేస్తున్న నాటి నుంచి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్య న్ తో తనకు మంచి బంధం ఉందన్న కేటీఆర్, ఆయన ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.