హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురినే తండ్రి కాటేశాడు. కూతురిపై ఎవరూ లేని సమయంలో వరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. బాధను భరించలేక ఎట్టకేలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సూరారం కాలనీ శివాలయనగర్ కు చెదిన 35 ఏళ్ల వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, 14 ఏళ్ల కూతురు ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై పెయింటర్ అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరించాడు. అలా బెదిరించి లొంగదీసుకుంటూ వచ్చాడు. ఇటీవల లైంగిక వేధింపులు తీవ్రం కావడంతో భరించలేక బాధితురాలు బుధవారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. 

విషయం తెలుసుకున్న స్థానికులు అతనిపై దాడికి ప్రయత్నించారు. అయితే, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం 5 నెలల గర్భవతి. పోలీసులు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.