హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి నడుపుతున్న కారు కింద పడి 8 నెలల పాప మృత్యువాత పడింది. ఈ సంఘటన ఆదివారంనాడు చోటు చేసుకుంది. 

చంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.... తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో 28 ఏళ్ల డ్రైవర్ ఖలీద్ సారీ తన కారును బయటకు తీయడానికి పూనుకున్నాడు. అకస్మాత్తుగా అతని 18 నెలల కూతురు కారు ముందుకు వచ్చింది. దాన్ని గమనించకుండా ఖలీద్ కారును తోలడంతో ఆమె మరణించింది.

ఏం జరిగిందో తెలుసుకుని అతను, అతని కుటుంబ సభ్యులు పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకని వెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు 

గస్తీ తిరుుగుతున్న పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. దాంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పాప తన కారు ముందు నించున్న విషయాన్ని ఖలీద్ గుర్తించలేదని, దాంతో కారును ముందుకు తోలడంతో పాప కారు ముందు చక్రాల కిందికి వచ్చిందని, ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయని చెబుతున్నారు.

మరో సంఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్కూటర్ పై వెళ్తున్న కందుకూరు చెందిన 40 ఏళ్ల వడ్రంగి గిరిచారి మరణించాడు. ఈ సంఘటన శనివారంనాడు యాచారంలోని చింతుల్ల గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్కూటర్ ను నడిపిన మిత్రుడు గాయాలతో బయటపడ్డాడు.