Asianet News TeluguAsianet News Telugu

ఔషధ గుణం కలిగిన కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ

కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును. తీపి, చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును. రూక్షత్వం, వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును. 

Haritaki Amazing Ways The Miraculous Herb Benefits You
Author
Hyderabad, First Published Feb 8, 2021, 11:53 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Haritaki Amazing Ways The Miraculous Herb Benefits You

ఆయుర్వేద శాస్త్రంలో కర్కక్కాయకు విశేష స్థానం ఉన్నది. ఎన్నోగుణగణాలు కలిగినది కరక్కాయ లవణరస వర్జితముగా, అయిదు రసములు గలదిగా,రూక్షముగా, వేడిగా, జఠరదీపనముగ , బుద్ధిబలమును ఇచ్చునదిగా, మధురపక్వముగా, ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా, నేత్రములకు హితవుగా , తేలికగా ఆయువును పెంపొందించునదిగా, ధాతువృద్ధిగా, వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను, దగ్గును, ప్రమేహమును, మొలలను, కుష్టును, నంజును, ఉదరమును, క్రిమిని, స్వరభంగమును, గ్రహిణిని, మలబద్ధకమును, విషజ్వరమును, గుల్మమును, కడుపుబ్బరం, దాహము, వాంతిని, ఎక్కిళ్ళను, దురదను, హృదయరోగమును, కామెర్లను, శూలను, ప్లీహారోగమును, అనాహమును, కాలేయవ్యాధిని, శిలామేహమును, మూత్రకృచ్చ రోగమును, మూత్రఘాత రోగమును నాశనం చేయును . 

తెలుగులో కరక్కాయ అంటారు,  సంస్కృతంలో హరీతకి అంటారు, హిందిలో హరడ్ అని, లాటిన్ భాషలో  TERMINALIA CHIBULA . కుటుంబము  - COMBRETACEAE. 

కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును. తీపి, చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును. రూక్షత్వం, వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును. ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. కరక్కాయను ( ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో - వర్షఋతువు ) నందు సైన్ధవ లవణము చేర్చి, అక్టోబర్, నవంబర్ నెలలలో - శరదృతువు ) యందు పంచదార చేర్చి,  ( డిసెంబర్, జనవరి నెలలలో - హేమంత ఋతువు ) నందు శొంఠిని చేర్చి ( ఫిబ్రవరి, మార్చి నెలలలో - శిశిరఋతువు ) నందు పిప్పలిని చేర్చి,  ( ఏప్రిల్, మే నెలలలో - వసంతఋతువు ) నందు తేనెని చేర్చి, ( జూన్, జులై నెలలలో- గ్రీష్మఋతువు) నందు బెల్లమును చేర్చి తినవలెను. కరక్కాయను భోజనం తర్వాత తినినను పథ్యకరమైనది. మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను, అజీర్ణ సమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 

కరక్కాయ మొత్తం ఏడు రూప లక్షణాలు 'రకాలు'గా కలదు, అవి :- 

 1) విజయా, 2) రోహిణీ, 3) పూతన, 4) అమృతా, 5) అభయా, 6)  జీవంతి, 7) చేతకీ. ఇవన్నియూ మొత్తం 7 జాతులుగా ఉండును.  వీటి గురించి సంపూర్ణముగ తెలుసుకుందాం. 

విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 

సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 

విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 

కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 

చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  

ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 

చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 

పైన తెలిపిన ఏడు జాతులలో విజయ కరక్కాయ ప్రధానమైనది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వ రోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది. గొప్పది, గుండ్రనిది, బరువు కలిగినది. నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు రెండు తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 

 "ముఖ్య గమనిక" అతిగా నడచినవాళ్లు, బలహీన శరీరం కలవాళ్ళు, చిక్కిన శరీరం కలవాళ్లు, ఉపవాసం వలన బలహీనపడిన వారు, శరీరం నందు అమిత వేడి కలిగినవారు, గర్భవతులు, రక్తం తీయబడిన వారు, రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు, హనుస్థంభ వాత రోగులు ఎట్టి పరిస్థితులలో ఈ కరక్కాయను వాడరాదు గమనించగలరు.


ఎన్నో అనారోగ్యాల నివారణకు దివ్య ఔషదం కరక్కాయ :-

*  బరువు తగ్గుట కొరకు - కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 

*  దగ్గు నివారణ కొరకు  - కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక, దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 

*  తలనొప్పి నివారణ కొరకు  - కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 

* కండ్ల ఎరుపు నివారణ కొరకు  - కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 

*  ఎక్కిళ్లు నివారణ కొరకు  - గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 

*  కామెర్ల నివారణ కొరకు  - కరక్కాయ, తేనె, బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 

*  కీళ్ళవాతము నివారణ కొరకు - కరక్కాయ చూర్ణమును, ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం, గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 

*  క్రిమిరోగముల నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును. ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది. 

*  కడుపునొప్పి నివారణ కొరకు - కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 

* చర్మరోగముల నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 

* విషమ జ్వరాల నివారణ కొరకు  - కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 

*  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  -  కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 

*  అర్శమొలల నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 

*  గోరుచుట్టు నివారణ కొరకు  - పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 

*  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 

*  రక్తస్రావ నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 

* శరీర బలం పెరుగుట కొరకు  - కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 

* పాండురోగం నివారణ కొరకు  - కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు, వరిబీజం తగ్గును. 

* చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 20 మీ.లి. గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు, కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 

* గొంతు బొంగురు నివారణ కొరకు  - కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 

* వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.

* అండవృద్ధి నివారణ కొరకు  - గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 

* నేత్రరోగ నివారణ కొరకు  - కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 

*  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును. 

* ఉదరరోగ నివారణ కొరకు  - ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 

* ఆహారం జీర్ణం అగుటకు  - వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును. 

* కఫజ్వర నివారణ కొరకు  - గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 

* వాంతుల నివారణ కొరకు  - కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 

*  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 

*  గుల్మ నివారణ కొరకు  -  కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 

* రక్తపిత్త రోగ నివారణ కొరకు  - అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 

* ఉబ్బురోగం నివారణ కొరకు - బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 

  


 

Follow Us:
Download App:
  • android
  • ios