‘ఆర్ ఎక్స్ 100’ డైరక్టర్ నెక్ట్స్ టైటిల్, వైయస్ జగన్ కు ముడి పెట్టారే!?
మహా సముద్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొన్న అజయ్ భూపతి ఇప్పుడు మరో మూవీతో పట్టాలు ఎక్కించేందుకు అవుతున్నాడు. తన మూడో చిత్రానికి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారబోతున్నాడు.
అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన రెండో సినిమాగా ’మహాసముద్రం‘ను రూపొందించారు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటించారు. హీరోయిన్స్‌గా అతిది రావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ నటించారు. జగపతి బాబు, రావు రమేశ్ కిలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. పోస్టర్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నప్పటికీ సినిమాకు మాత్రం ఆశించిన స్పందన రాలేదు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ సినిమా డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అప్పుడు అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అభిమానులకు అంచనాలకు అందుకోలేకపోయినందుకు క్షమించాలని ఆయన పేర్కొన్నారు. అందరికీ నచ్చేలా తన మూడో సినిమా తీస్తానని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఆ మూడో సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.
హీరోయిన్ ఓరియెంటెండ్ కథతో ఈ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. పూర్తిస్దాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా అని తెలుస్తోంది. ఫలానా వారు..హీరో ,హీరోయిన్ అని కాకుండా కీలకమైన కొన్ని ప్రధాన పాత్రల మధ్య జరిగే కథగా రూపొందుతోందని తెలుస్తోంది.ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దాదాపు 80 రోజుల షూటింగ్ డేస్ అని, 30 రోజులు నైట్ వర్కింగ్ డేస్ చెప్తున్నారు. తెలుగు, హింది నటులు కలగలుపుగా ఈ సినిమాలో చేస్తున్నారని అంటున్నారు.
ఈ నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాకు ‘మంగళవారం’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకూ నిజమో కానీ...ఈ టైటిల్ విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ టైటిల్ చుట్టూ సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు మామూలుగా లేవు. పచ్చి బూతు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు జగన్ వ్యతిరేకులు..ఇది జగన్ మీద తీస్తున్న సినిమానా..మంగళవారం ఆయన పేటెంట్ అంటూ వెటకారం చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా ప్రారంభం కాకుండానే వార్తల్లో నిలవటం విశేషమే.