నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ కావటంతో నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాలయ్య. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్‌ బయోపిక్ తీవ్రంగా నిరాశపరిచింది.

తండ్రి పాత్రలో బాలయ్య నటనపై కూడా విమర్శలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌ గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఆ తరువాత ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో  రూపొందిన రూలర్‌ సినిమా కూడా డిజాస్టర్ కావటంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు.

దీంతో మరోసారి గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఓ మూవీ బాలయ్యను అతిథి పాత్రలో నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారట దర్శక నిర్మాతలు. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ తలైవి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో నటించేందుకు బాలయ్య ను సంప్రదించారట దర్శక నిర్మాతలు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్‌ కూడా నిర్మాత కావటంతో బాలయ్య ఆ పాత్రకు ఒప్పుకుంటాడని భావించారు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌ పాత్ర అంటేనే భయపడుతున్నాడట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత్రను అంగీకరించేది లేదని తెగేసి చెప్పేశాడట నందమూరి నట సింహం.