మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. రీ ఎంట్రీలో ముందు కాస్త నెమ్మదిగా అడుగులు వేసిన చిరు, ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి ప్రస్టీజియస్‌ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. ఇప్పటికే మొత్తం షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆ ఖాళీ సమయంలో తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు మెగాస్టార్‌.

ఆచార్య తరువాత మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు చిరు. ఇప్పటికే రీమేక్‌ హక్కులను కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. ఇటీవల వెంకీ మామ సినిమాతో సూపర్‌ హిట అందుకున్న బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. గతంలో మెగా క్యాంపులో పవన్‌ హీరోగా సర్థార్‌ గబ్బర్ సింగ్‌ సినిమాను తెరకెక్కించాడు బాబీ.

ఇప్పుడు అదే దర్శకుడిగా చిరు సినిమా చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకా సమయం పడుతుంది. లూసీఫర్‌ సినిమా సూపర్‌ హిట్ కావటంతో తెలుగులోనూ డబ్ అయ్యింది. దాదాపు తెలుగు ప్రేక్షకులంతా ఆ సినిమాను చేసేశారు. ఇప్పుడు అదే కథతో చిరు సినిమాచేస్తే వర్క్‌ అవుట్‌ అవుతుందా..? గతంలో ఇలాతే వీరం సినిమాను తెలుగులో కాటమరాయుడు పేరు రీమేక్ చేసిన పవన్‌ ఫెయిల్ అయ్యాడు. మరి చిరు అదే తప్పు చేస్తాడా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.