యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. బాలీవుడ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు రీజినల్ సినిమా మీద దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గటంతోనే ఇలా సౌత్ సినిమాల వైపు చూస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ భామ మరో టాలీవుడ్ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యూజిక్‌ వీడియోస్‌తో గ్లామర్‌ ఫీల్డ్ కి పరిచయం అయిన జాక్వెలిన్‌ చివరగా బాలీవుడ్‌ లో రేస్‌ 3 సినిమాలో నటించింది. తాజాగా బాద్‌ షా మ్యూజిక్‌ వీడియో గెండా ఫూల్‌ లోనూ నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ టాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం పింక్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న చిత్రయూనిట్ అందుకోసమే బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బెటర్ అని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై దర్శకుడు క్రిష్, జాక్వెలిన్‌ మధ్య చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది.