#Chiranjeevi:చిరు కాదన్న కథనే మార్చి నితిన్ తో...?
ఒక హీరోతో కాదనుకున్న కథని మరో హీరో తో ఓకే చేయించుకుని హిట్ కొట్టడం ఇండస్ట్రీలో పరిపాటే. అలాగే ఇప్పుడు చిరంజీవి నో చెప్పిన కథతో నితిన్ సినిమా చేయబోతున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.
"ఆచార్య" సినిమా డిజాస్టర్ తో చిరంజీవి కథలు ఎంచుకునే పద్దతిలో చాలా మార్పు వచ్చింది. ఆయన అప్పటికే ఓకే చేసిన ప్రాజెక్టులను కూడా తన ఇమేజ్ కు సరిపడతాయా అని చూసుకుంటున్నారు. కథల్లో మార్పులు చేయదగ్గవి అయితే ఓకే అనుకుని ముందుకు వెళ్తున్నారు. లేకపోతే వద్దని చెప్పేస్తున్నారు. ఎంతో హైప్ తెచ్చిన గాడ్ ఫాధర్ చిత్రం సైతం అనుకున్న స్దాయిలో కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క చిరంజీవి తదుపరి సినిమాలపై బజ్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ చిరు దగ్గర పెద్ద లైనప్ ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలు చేయనున్నారు.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న "వాల్తేరు వీరయ్య" సినిమాతో కూడా బిజీగా ఉన్న చిరు వెంకీ కుడుముల తో కూడా సినిమా చేయాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించేవారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలెక్కేలాగా కనిపించడం లేదు. వెంకీ కుడుముల చెప్పిన కామెడీ కథ వినటానికి బాగున్నా... తన ఇమేజ్ కు తగినట్లు ఉందా అని చిరంజీవి ఆలోచించి, మార్పులు చేసినా కథను పాడు చేసినట్లు అవుతుంది కానీ ఉపయోగం ఉండదని, అంత లైట్ హార్టెడ్ కామెడీల్లో తనను చూడరని వద్దని చెప్పేసారని ఫిల్మ్ నగర్ వార్త.
మరో ప్రక్క చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని వెంకీ హ్యాండిల్ చేయగలరా అని అనుమానాలు ఎప్పటినుండో కొందరిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వెంకీ కుడుముల తన కథతో చిరంజీవిని మెప్పించలేకపోయారు. ఇప్పటికే చాలాసార్లు వెంకీ కుడుముల కథలో బోలెడు మార్పులు చేర్పులు చేసి మరి చిరంజీవికి వినిపించటం జరిగింది కానీ కథ ఏమాత్రం నచ్చకపోవడంతో చిరంజీవి చేసేది లేక ఈ సినిమాని తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అదే కథని కొద్ది మార్పులు చేసి తన హీరో నితిన్ ని కలిసారని తెలుస్తోంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ వంటి సూపర్ హిట్ వచ్చింది. కాబట్టి ఈ కాంబోకు ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.