బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటంతో దేశ వ్యాప్తంగా ఆ తరహ సినిమాలు తెరకెక్కించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదే బాటలో బాహుబలి విలన్‌ రానా కూడా ఓ భారీ పౌరాణిక చిత్రానికి రెడీ అయ్యాడు. భక్త ప్రహ్లద కథను హిరణ్య కశ్యప పేరుతో రూపొందించి ఆ సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటించాలని భావించాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు. మూడేళ్ల క్రితమే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.

రుద్రమదేవి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. సెట్స్ కు సంంబంధించిన పనుల నిర్మాణం కూడా మొదలైంది. అయితే ఈలోగా రానా ఆరోగ్య సమస్యలతో విదేశాలకు వెళ్లిపోవటంతో ఈ సినిమా పనులకు బ్రేక్‌ పడింది. రానా బాగా సన్నబడటంతో హిరణ్య కశ్యప సినిమాను చేయడన్న ప్రచారం కూడా జరిగింది. కానీ తరువాత రానా స్వయంగా హిరణ్య కశ్యప ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు.

దీంతో మరోసారి ఈ భారీ చిత్రం తెర మీదకు వచ్చింది. అయితే తాజాగా కరోనా లాక్ డౌన కారణంగా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటంతో హిరణ్య కశ్యప సినిమా మీద అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎప్పటికి చక్కదిద్దుకుంటాయో తెలియదు. దీంతో భారీ చిత్రాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇక  హిరణ్య కశ్యప సినిమా ఉండకపోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.