ప్రస్తుత కాలంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసమంటూ ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తూనే ఉన్నారు. అయితే.. పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తున్నప్పుడు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 

వాళ్లకంటూ ఓ గది ఉంటే... అందులోనే వాళ్లు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. కాబట్టి... దానిని చాలా ఊహాత్మకంగా, క్రియేటివ్ గా అలంకరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. పిల్లలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎదుగుతూ ఉంటారు. వారిలాగే వాళ్ల ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరులు మారుతూ ఉంటాయి. కాబట్టి.. వారి అభిరుచిని బట్టి గదిని కూడా మారుస్తూ ఉండాలి. 

ఉదాహరణకు మీరు ఇప్పుడు పది సంవత్సరాల లోపు చిన్నారి గదిని అలంకరించాలి అని అనుకున్నారనుకోండి... వారికి ఇష్టమైన కార్టూన్, లేదా వారికి ఇష్టమైన బొమ్మ కారు, ట్రైన్ లాంటి థీమ్ ని ఎంపిక చేసుకోవాలి. వాళ్లకు నచ్చిన థీమ్ ని ఎంపిక చేసుకొని గదిని అందంగా అలంకరిస్తే... వారిలోని ఊహాశక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.

మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. గదిలోని సహజమైన వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు  చేయాలి. సహజంగా గదిలోకి వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటే... పగటి పూట వాళ్లు ఆడుకోవడానికి, చదువుకోవడానికి, రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గదిలోకి స్వచ్ఛమైన గాలి రావడం వారికి హాయిని కలిగిస్తుంది.

వారి గదిలోని గోడలకు విభిన్న రంగులను ఎంపిక చేసుకోవచ్చు. వారికి నచ్చిన రంగు ని ఎంపిక చేయడం మాత్రం మరిచిపోవద్దు. గదిలోని లైట్స్  కూడా వాళ్లకి నచ్చేవిధంగా ఎంపిక చేయాలి. అయితే... రంగుల విషయంలో ఓవిషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గోడలకు వేసే రంగులు కాంతిని ఇచ్చేవిధంగా ఉండాలి. డార్క్ కలర్స్  కి దూరంగా ఉండటం మంచిది.

దాదాపు పిల్లల గది అంటే చిన్నగానే ఉంటుంది. ఆ చిన్న గది గోడలకు లేత రంగులు వేస్తే.. గది విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ఎరుపు, ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం రంగులను ఎంపిక చేయాల్సి వస్తే.. వాటిని కేవలం ఒక్క గోడకే పరిమితం చేయాలి.

పిల్లలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే విషయం బొమ్మలు. ఇవి లేకుండా ఏ పిల్లల ఇల్లు ఉండదు. వాళ్లకి ఆ బొమ్మలే ప్రాణం. మరి వాళ్లకంటూ గదిని కేటాయిస్తే... వాళ్ల బొమ్మలను దాచుకోవడానికి కూడా ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకు అందే ఎత్తులో వాళ్ల బొమ్మలను దాచుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. దీని వల్ల వారిలో క్రమశిక్షణ కూడా అలవడుతుంది. 

వాళ్లకు సంబంధించిన మెడిసిన్స్ లాంటివి మాత్రం వాళ్లకు అందనంత ఎత్తులో ఉంచడం మంచిది. అందకుండా పెట్టినప్పటికీ...వాటికి లాక్స్ లాంటివి పెట్టడం మరిచిపోవద్దు. 

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది... స్టడీ ఏరియా. గదిలోని ఏ ప్రాంతంలోకి స్వచ్చమైన గాలి, వెలుతురు వస్తుందో అక్కడ.. వారు చదువుకోవడం, రాసుకోవడం చేసుకునేలా ఏర్పాటు చేయాలి. పిల్లలు డిమ్ లైట్ కింద చదువుకోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా... పిల్లల గ్రో చార్ట్ ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల పిల్లలు ఎలా ఎదుగుదల ఎలా ఉందన్న విషయంపై మీకు కూడా అవగాహన కలుగుతుంది.