సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర చేస్తారా? రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌లో ఎలా చేయాలంటే?
Amarnath Yatra: భారీ పర్వతాలపై అత్యంత ఎత్తులో మంచు లింగంగా కొలువైన అమరనాథుడిని దర్శించాలని కోరుకుంటున్నారా? ఇది సాధారణ ప్రజలకు సాహసోపేతమైన ప్రయాణమే. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అమర్‌నాథ్ యాత్ర - 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. యాత్ర కోసం మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ యాత్రలో పాల్గొనాలంటే ముందు మీరు ఫిట్ గా ఉండాలి. అంటే మీరు ఆరోగ్యంగా కొండలు ఎక్కడానికి అవసరమైన శరీర బలాన్ని కలిగి ఉన్నారని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడు ఇచ్చిన CHC (ఆరోగ్య ధ్రువీకరణ పత్రం) తీసుకోవాలి. అమర్ నాథ్ యాత్ర ఎత్తైన కఠినమైన మార్గాల గుండా వెళుతుంది. కాబట్టి అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే ఈ యాత్ర చేయాలి.

అమర్‌నాథ్ యాత్ర 2025 తేదీలు
అమర్ నాథ్ యాత్రలు 3 జులై 2025న ప్రారంభమవుతాయి. 9 ఆగస్టు 2025 తో ముగుస్తాయి. ఈ 39 రోజుల వ్యవధి కాలంలోనే యాత్ర చేయాల్సి ఉంటుంది. ఈసారి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. యాత్ర మధ్యలో పహల్గాం, శ్రీనగర్, జమ్మూ, బాల్టాల్, పంథా చౌక్, నున్వాన్ మొదలైన చోట్ల వసతి కల్పిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
www.shriamarnathjishrine.com అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత “ఆన్‌లైన్ సేవలు” ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత “యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్” సెలెక్ట్ చేసుకోండి. కండీషన్స్ అన్నీ చదివి ‘‘యాక్సెప్ట్’’ పై క్లిక్ చేయండి. తర్వాత “రిజిస్టర్” బటన్ నొక్కి దరఖాస్తు ఫారమ్ నింపండి. మీ పూర్తి వివరాలు నింపిన తర్వాత ఆరోగ్య ధ్రువీకరణ పత్రం(CHC) అప్‌లోడ్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి, రూ.200 చెల్లించండి. తర్వాత యాత్ర పర్మిట్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఫీజు రూ.200గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు జిల్లాల్లో ఉన్న 533 అధీకృత బ్యాంక్ శాఖల ద్వారా దీన్ని చేయవచ్చు. శ్రీ అమర్‌నాథ్జీ ష్రైన్ బోర్డ్ (SASB) అధికారిక వెబ్‌సైట్ లోకి వెళితే మీకు దగ్గరగా ఉన్న ఏ బ్యాంక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో తెలుస్తుంది.
యాత్రలో ఈ పనులు చేయకూడదు?
మద్యం, సిగరెట్లు, కాఫీ, టీలు తాగకూడదు. ఈ పదార్థాలు శరీరం ఆక్సిజన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ప్రమాదం పెరుగుతుంది. అనారోగ్యంగా ఉంటే డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకొని వారు వెళ్లమంటనే వెళ్లండి. కొన్ని వ్యాధులు ఉన్న వారు వెళితే ప్రాణాలకు ముప్పు రావచ్చు.

యాత్రకు ముందు ఏమి చేయాలి?
ప్రతిరోజూ 4 నుంచి 5 KM నడవండి. దీనివల్ల శరీరం క్రమంగా ట్రెక్కింగ్‌కు సిద్ధమవుతుంది. ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్, ప్రాథమిక యోగాభ్యాసం చేయండి. ఈ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. నీరు బాగా తాగాలి. అంటే రోజంతా 4 నుండి 5 లీటర్ల వరకు ద్రవాలు తీసుకోవాలి. తద్వారా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలసట, తలనొప్పి, మౌంటెన్ సిక్‌నెస్ నుండి రక్షిస్తుంది. శక్తిని కాపాడుకోవడానికి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
యాత్ర మార్గంలో ప్రతి 2 కిలోమీటర్లకు వైద్య సహాయ కేంద్రం ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే అక్కడ సహాయం తీసుకోండి.