పిల్లల్ని పంపాల్సింది స్కూలుకు.. పనికి కాదు: CRY
ప్రతి ఏడాది జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లోని ప్రతి చిన్నారికీ భద్రమైన, ఆరోగ్యవంతమైన, అండ లభించే వాతావరణంలో ఆనందంగా పెరిగే హక్కు అమలయ్యేలా మరింత కలసికట్టుగా కృషి చేయటానికి ప్రతిజ్ఞ చేయాలని CRY పిలుపునిస్తోంది.

CRY
బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అగ్రస్థాయి భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY- ‘చైల్డ్ రైట్స్ అండ్ యు’తెలంగాణ లోని మూడు జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయిలోని తన భాగస్వామ్య సంస్థలతో కలిసి వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి సామూహిక నిబద్ధత, విశ్రాంత కృషి అవసరమమంటూ..‘ సంకల్పం, దృఢ చిత్తం కలిసినపుడు మార్పు సాధ్యమవుతుంది’అన్నఅంతర్జాతీయ కార్మికసంస్థ (ILO) ప్రకటనకు అనుగుణంగా CRY ఈ కార్యక్రమాలను చేపట్టింది.
తెలంగాణ లో ఇతర జిల్లాలతో పోల్చినపుడు బాల కార్మికత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు: ఖమ్మం, నాగర్ కర్నూల్, మేడ్చల్. ఈ జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో CRY తన భాగస్వామ్య సంస్థలతో కలిసి జూన్ 6 నుంచి 12 వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలను పనిలో పెట్టుకోవటం ద్వారా వారికి సాయం చేయొద్దు.. అనే నినాదంతో CRY జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
CRY
వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యాచరణలో స్కూళ్లు, సామాజిక బృందాల స్థాయిల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బాల కార్మిక రహిత సమాజాన్ని రూపొందించే క్రమంలో ప్రతి చిన్నారీ పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా చూడటానికి స్థానిక, జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి పని చేయటం వంటి కార్యక్రమాలు ఉన్నాయని CRY తెలిపింది.
ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి
బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో నిరంతర సమస్యగానే కొనసాగుతోంది. బాల కార్మికులపై UNICEF, ILO విడుదల చేసిన "చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్ 2020: ట్రెండ్స్ అండ్ ది రోడ్ ఫర్ ఫార్వర్డ్" ప్రకారం,.. "2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది చిన్నారులు (5 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లలు) 6.3 కోట్ల మంది బాలికలు, 9.7 కోట్ల మంది బాలురు-బాలకార్మికులుగా ఉన్నట్టు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయి.
CRY
ఈ బాల కార్మికులలో దాదాపు సగం మంది "ప్రమాదకరమైన పనిలో ఉన్నారు. ఇది వారి ఆరోగ్యం, భద్రత, నైతిక అభివృద్ధికి నేరుగా ముప్పు కలిగిస్తోంది" అని కూడా ఆ నివేదిక వెల్లడిస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతదేశంలో 5 నుంచి 13 సంవత్సరాల వయసు పిల్లలు 75 లక్షల మందికి పైగా (కచ్చితమైన సంఖ్య 76,79,035) బాల కార్మికులుగా ఉన్నారు. వీరిలో 42,06,708 మంది బాలురు కాగా, 34,72,327 మంది బాలికలు ఉన్నారు. అలాగే 14 నుంచి 17 సంవత్సరాల వయసులోని కిశోర బాలబాలికలు 1,61,00,448 మంది వాణిజ్య పనుల్లో కొనసాగుతున్నారు. వీరిలో 1,01,40,659 మంది బాలురు కాగా, 59,59,789 మంది బాలికలు ఉన్నారు.
2011లో విభజనకు మునపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4,96,451 మంది బాల కార్మికులు (5 నుంచి 13 సంవత్సరాల వయసు చిన్నారులు) ఉన్నారని.. వారిలో 2,52,957 మంది బాలురు, 2,43,494 మంది బాలికలు ఉన్నారని అవే గణాంకాలు చూపిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న కిశోర బాలబాలికల (14 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లలు) సంఖ్య 11,86,285 గా ఉంది. వీరిలో 6,65,409 మంది బాలురు కాగా, 5,20,876 మంది బాలికలు ఉన్నారు.
CRY
సమాచార కొరత: పెద్ద అవరోధం
దేశ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ తాజా పరిస్థితులకు సంబంధించి.. ఒక దశాబ్దం కంటే పాతవైన 2011 జనాభా లెక్కలు మినహా ఇటీవలి కాలంలో సేకరించిన అధికారిక సమాచారం కానీ, ప్రామాణిక సమాచారం కానీ అందుబాటులో లేదు. ఇది ప్రధాన అవరోధం. పైగా కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్థితుల్లో బలవంతంగా కార్మికులుగా మారిన పిల్లల సంఖ్య బాగా పెరిగిందని పలు అంచనాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమాచారం లేకపోవటం బాల కార్మికత వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్య సాధనకు పెద్ద అవరోధంగా నిలుస్తోంది.
"సమాజ స్థాయిలో ప్రజా సమూహాలకు తగినంతగా జీవనోపాధి అవకాశాలను సృష్టించడం చాలా ముఖ్యం. అలా చేయటం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను బలవంతంగా పనికి పపంచే పరిస్థితులు లేకుండా చూడొచ్చు. అయితే బాలకార్మికత వ్యాప్తి, విస్తృతి, పరిస్థితి గురించి మనకు కచ్చితంగా తెలియకపోతే.. దానిని రూపుమాపటం కోసం నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించటం కష్టం. బాల కార్మికతకు ప్రస్తుత స్థితికి సంబంధించి సవివరమైన, తాజా గణాంకాలు, సమాచారం ఉన్నట్టైతే.. ఈ పరిస్థితిని మార్చటానికి అది సాయపడుతుంది. సమస్యను నిర్మూలించడానికి చాలా దోహదపడుతుంది" అని CRY(South)రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ చెప్పారు.
దేశం అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాల కార్మికతను తగ్గించడంలో గత దశాబ్ద కాలంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ.. కోవిడ్ మహమ్మారి ఆ ప్రగతిని అడ్డుకుని తిరోగమనంలోకి నెట్టింది. ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. కుటుంబాలను పేదరికంలోకి నెట్టివేసింది. ఫలితంగా ఎంతో మంది చిన్నారులు బడికి దూరమయ్యారు. బలవంతంగా బాల కార్మికులుగా మారారు" అని జాన్ వివరించారు.
CRY
ముందుకు సాగే మార్గం
ఈ పరిస్థితుల్లో మనం బాలల సంరక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యను మరింతగా అందుబాటులో ఉండేలా చూడటంతో పాటుగా పేదరికం నుంచి కుటుంబాలు, చిన్నారులు బయటపడేందుకు దోహదపడే సామాజిక మద్దతు వ్యవస్థలను పెంపొందించటం చాలా ముఖ్యం. తద్వారా చిన్నారులను, వారి బాల్యాన్ని దోపిడీ చేసే విషవలయం అంతమవుతుంది" అని ఆయన వివరించారు.
వచ్చే మూడేండ్లలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో Child Rights and You సంస్థ తన కార్యక్రమాలు అమలు చేస్తున్న 553 గ్రామాలను బాల కార్మిక రహిత గ్రామాలుగా మార్చాలనే లక్ష్యంతో CRY పనిచేస్తోందని ఆయన చెప్పారు.
ఈ ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి చిన్నారికీ భద్రమైన, ఆరోగ్యవంతమైన, అండ లభించే వాతావరణంలో ఆనందంగా పెరిగే హక్కు అమలయ్యేలా మనం మరింత బాగా కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. మనమందరం కలిసి బాల కార్మికతను అంతం చేయొచ్చు. బాల్యాన్ని పరి రక్షించొచ్చు. మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించవచ్చు.. అని జాన్ పిలుపునిచ్చారు.
CRY
CRY - Child Rights and You ఒక భారతీయ NGO. ప్రతి చిన్నారికీ జీవించే, నేర్చుకునే, పెరిగే, ఆడుకునే హక్కు ఉందని CRY విశ్వసిస్తోంది. CRY నాలుగు దశాబ్దాలుగా, తన 850 క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు, సామాజిక బృందాలతో కలిసి పనిచేస్తూ భారతదేశంలోని 19 రాష్ట్రాలలో 30,00,000మందికి పైగా అణగారిన, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో శాశ్వత మార్పును సాకారం చేసింది. మరింత సమాచారం కోసం www.cry.org. ను సందర్శించండి.