వాతావరణం : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు ... శివరాత్రి తర్వాత ఇక చుక్కలే
Telugu states weather : అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే పగటిపూట బయటకు వెళితే మాడు పగిలేలా తయారయ్యింది పరిస్థితి. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎలా వుండనుందంటే...

w
Telangana Weather : సంక్రాంతి పండగవేళ చలి గజగజా వణికిస్తుంది... కానీ ఈసారి మాత్రం వాతావరణం సాధారణంగానే వుంది. జనవరిలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలేం నమోదు కాలేదు... ఇకపై నమోదయ్యే అవకాశాలు లేవు. సాధారణంగా ఫిబ్రవరిలో మెల్లగా చలి తగ్గుతూ వచ్చి వేడి పెరుగుతుంది... శివరాత్రికి తర్వాత అంటే మార్చ్ లో వేసవి ప్రారంభం అవుతుంది. కానీ తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పుడే వేసవి వాతావరణం కనిపిస్తోంది.
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నారు. ఫిబ్రవరిలోనే పగటిపూట సూర్యుడు భగభగమంటున్నాడు... దీంతో ప్రజలు భయట తిరిగేందుకు భయపడుతున్నారు. ఇక రాత్రి సమయంలో ఉక్కపోత పెరిగింది... ఏసి, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగిపోయింది. ఇప్పుడే పరిస్థితి ఇలావుంటే నడి వేసవిలో ఎండలు ఇంకే స్థాయిలో వుంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు.
Hyderabad Weather
హైదరాబాద్ వాతావరణం :
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సూరీడు ఎరుపెక్కడం ప్రారంభించాడు... సాధారణంగా మార్చిలో మొదలయ్యే ఎండలు మేలో తీవ్రస్థాయికి చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం ఇంకా శీతాకాలం ముగియనేలేదు వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి వుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా వుంది. అసలే నగరం కాంక్రీట్ జంగిల్ లా మారడం, భారీ వాహనాల రాకపోకలతో ఏర్పడే పొల్యూషన్ కారణంగా సాధారణంగానే వాతావరణం వేడిగా వుంటుంది. దీనికి తోడు ఇప్పుడు ఎండలు కూడా తొందరగానే ప్రారంభం కావడంతో రాబోయే నాలుగైదు నెలలు నగరవాసులకు ఇబ్బంది తప్పదు. పరిస్థితి చూస్తుంటే ఈసారి సన్ స్ట్రోక్ గట్టిగా తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో ఇప్పుడే పగటిపూట 34 నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో 13 నుండి 22 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇది సాధారణంగా ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు. రాబోయే మూడునాలుగు రోజులు ఎండలు మరింత పెరిగి ఉష్ణోగత్రలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం మెల్లిగా పెరుగుతోంది. ఇన్నిరోజులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు బంద్ వుండేవి కాబట్టి విద్యుత్ వినియోగం తక్కువగా వుండేది... కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో వాటి వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్ధితి ఎలావుందో ఈ విద్యుత్ వినియోగమే చెబుతోంది.
Andhra Pradesh Weather
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి వుంది. ఇప్పుడే రాష్ట్రంలోని పలుప్రాంతాలు మరీముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 35 నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే రాత్రిపూట ఉక్కపోత మొదలయ్యింది. కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా వున్నాయి.
వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం, అనకాపల్లి, సత్యసాయి, కర్నూల్, అనంతపురం, తిరుపతి, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో ప్రస్తుతం 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగి ఈ ఏడాదిలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గతేడాది 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపుపొందింది. 1901 తర్వాత అత్యధిక వేడి ఈ ఏడాదే నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ఈసారి కూడా ఇదే పరిస్థితి వుంటుందనేది వాతావరణ శాఖ అధికారుల అంచనా. అందుకే ఇంకా వేసవి ప్రారంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయి.