బిజెపిలో కలకలం:బండి సంజయ్ మీద విజయశాంతి గుర్రు
తీవ్రమైన అసమ్మతితోనే ఆమె బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. తన అసమ్మతిని ఆమె పార్టీ జాతీయ నాయకత్వం వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

హైదరాబాద్: తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న బిజెపిలో పార్టీ నేత, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి ఆమె తన అసమ్మతిని వ్యక్తం చేశారు. బిజెపి నాయకత్వం తనను వదిలేసిందని ఆమె వ్యాఖ్యానించారు. బిజెపి నాయకత్వం తనకు ఏ విధమైన బాధ్యతలూ అప్పగించలేదని, పార్టీలో తాను నిర్వహించాల్సిన పాత్రను నిర్ణయించలేదని ఆమె అన్నారు.
సర్దార్ సర్వాయి పాపనన జయంతి ఉత్సవాలకు హాజరైన ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనను విస్మరించినప్పటికీ తాను హుందాగా వ్యవహరిస్తున్నాని విజయశాంతి అన్నారు. తీవ్రమైన అసమ్మతితోనే ఆమె బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. తన అసమ్మతిని ఆమె పార్టీ జాతీయ నాయకత్వం వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.
తనలాంటి సీనియర్లకు ఏ విధమైన బాధ్యతలు కూడా అప్పగించకపోతే పార్టీ నష్టపోతుందని ఆమె అన్నారు. కేంద్ర నాయకత్వంతో ఏ విధమైన ఇబ్బంది లేదని, పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకుని వెళ్లాలని విజయశాంతి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. తన వల్ల కొంత మంది నాయకులు అభద్రతకు గురవుతున్నారని ఆమె తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో విజయశాంతి విషయంలో పార్టీ నాయకత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. తెలంగాణ రాములమ్మగా పేరు గాంచిన విజయశాంతికి రాష్ట్రంలో అభిమానులు దండిగానే ఉన్నారు.