అమెరికా హెచ్-1బీ వీసా ఫీజు పెంపు.. హైదరాబాద్ ఐటీపై కొత్త ఆశలు..
H1B Visa Fee Hike: అమెరికాలో హెచ్ 1 బీ వీసా ఫీజు పెంపు భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం దీన్ని కొత్త ఐటీ పెట్టుబడులకు, హైదరాబాద్‌లో ఐటీ బూమ్‌కు అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది.

అమెరికా కల
ఒకప్పుడు అమెరికా అంటే కలల దేశం. ఇక్కడ చదువుకుంటే మంచి భవిష్యత్తు, పెద్ద జీతం, నలుగురిలో గౌరవం ఉంటుందని భావించే వారు. ఐటీ ఉద్యోగుల పిల్లల నుండి పల్లెటూర్ రైతు బిడ్డల వరకు అందరి ఆశ అమెరికా వీసా. ‘మా పిల్లాడు అమెరికాకు వెళ్తుండు’ అని గర్వంగా చెప్పుకునేవారు. ఆ మాటల్లో ఎన్నో ఆశలు, ఆశయాలు, త్యాగాలు ఉండేవి. కానీ, ఈ మధ్యకాలంలో అమెరికా ప్రయాణంపై యువత ఉత్సాహం చూపించలేకపోతున్నారు. అగ్రదేశంలో ఉద్యోగాలంటే ఆగం అవుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల అమెరికా వీసాల్లో గణనీయమైన మార్పులు రాయడంతో అమెరికా కల కల్లగానే మిగిలిపోతుంది. ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి.
హెచ్ 1 బీ వీసా పెంపు
డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా వీసాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అధికారికంగా అమెరికాకు వెళ్లినవారైనా, అనధికారికంగా వెళ్లినవారైనా ఈ కొత్త నియమావళి వారి జీవితంపై ప్రభావం చూపనుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ (H1B) వీసా ఫీజు విధానంపై సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నియమాల ప్రకారం, H1B వీసా దరఖాస్తుల కోసం ఏడాదికి $1,00,000 (సుమారు రూ. 88 లక్షలు) ఫీజు విధించబడింది. అయితే, ఇప్పటికే H1B వీసా పొందినవారికి ఈ ఫీజు వర్తించదు, కేవలం కొత్త దరఖాస్తుదారులకే ఇది అమలులో ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని H1B వీసాల దుర్వినియోగాన్ని తగ్గించడం, అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా తీసుకున్నారనే వైట్ హౌస్ వాదన.
భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై తీవ్ర ప్రభావం
అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఈ మార్పులు చేసినా, స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించినా.. ట్రంప్ హెచ్-1బీ (H1B) వీసా ఫీజు పెంపు మాత్రం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లోని ఒక నివేదిక చెబుతున్న ప్రకారం 2023లో భారతీయులకు 1,91,000 వేల హెచ్1 బి బీసాలు జారీ అయ్యాయి. అదే 2024లో ఆ సంఖ్య రెండు లక్షల ఏడు వేలుకి చేరింది. ఎక్కువగా ఐటీ, సాఫ్ట్ వేర్ నిపుణులు అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ట్రంప్ కు ఇతర దేశస్థులు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి అన్నది ఆయన వాదన. ప్రస్తుతం ఏటా అమెరికా వెళ్లేందుకు 85 వేల హెచ్ 1 బీ వీసాలు జారీ చేసింది. ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. వీరిలోసుమారు 71% మంది భారతీయులే. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఈ వీసాలపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంలో ఇకపై అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
పెట్టుబడుల తెలంగాణ ఆశలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్-1బీ (H1B) వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు షాక్ ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద అవకాశంగా చూస్తోంది. ఐటీ శాఖ మంత్రి డాక్టర్ శ్రీధర్ బాబు వివరించిన ప్రకారం.. హెచ్-1బీ వీసా హోల్డర్లలో 73 శాతం మంది భారతీయులే కాగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి సుమారు 20 శాతం వాటా కలిగి ఉన్నాయి. వీసా ఫీజు పెంపు కారణంగా ప్రస్తుతం తెలంగాణ ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. రిమిటెన్స్ తగ్గుదల, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మందగమనంలాంటి సమస్యలు తలెత్తవచ్చు. అమెరికాలో పనిచేస్తున్న వేలాది ఇంజినీర్లు తమ కుటుంబాలకు పంపే డబ్బు తగ్గిపోవచ్చని గుర్తు చేశారు. దీన్ని ప్రత్యేక అవకాశంగా మార్చుకుంటే.. తెలంగాణను పెద్ద ఐటీ హాబ్ గా మార్చుకునే అవకాశమందని, ప్రపంచ పెట్టుబడులను హైదరాబాద్లోకి ఆకర్షించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ వైపు ప్రపంచం దృష్టి
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి త్వరలో హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలతో సమావేశం తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ప్రతిపాదిత భారత్ ప్యూచర్ సిటీ లో కార్యకలాపాలను విస్తరించే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడినట్లుగా హైదరాబాద్‌కు ఇప్పటికే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ ఉంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs), స్టార్టప్స్, డేటా సెంటర్లు, ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ ఉండటంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ ఐటీ కంపెనీలను సులభంగా ఆహ్వానించగలదని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం హెచ్ 1 బీ (H-1B)వీసాలపై ఆధారపడే ప్రముఖ భారతీయ ఐటీ ( IT)సంస్థలను పరిశీలిస్తే.. ఇన్పోసిస్ (Infosys)లో సుమారు 1.5 లక్ష మంది, టీసీఎస్ (TCS)లో 1.21 లక్ష మంది, విప్రో ( Wipro)లో 60,000 మంది, హెచ్సీఎల్ టెక్ (HCLTech)లో 57,000 మంది, టెక్ మహేంద్ర ( TechMahindra)లో 22,000 మంది ఉద్యోగులు H-1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఐటీ సంస్థలు కూడా ఈ విధానంపై ఆధారపడి ఉండటం వల్ల, H-1B వీసా రుసుము పెంపు వల్ల వేలలాది IT నిపుణులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులు
గత రెండు సంవత్సరాలలో తెలంగాణలో విదేశీ పెట్టుబడుల గణనీయంగా పెరిగాయి. 2024లో డావోస్ వేదికపై తెలంగాణలో సైన్ చేసిన MoUs మొత్తం రూ. 40,832 కోట్లు చేరగా, ఇందులో ఐటీ (IT), గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (GCC), డేటా సెంటర్ ప్రాజెక్టుల విలువ రూ. 15,200 కోట్లు. అంటే సుమారు 37% వాటా కలిగి ఉన్నాయి. 2025లో ఈ సంఖ్యలు మరింత ఎక్కువగా పెరిగి, MoUs మొత్తం రూ. 1,78,950 కోట్లు చేరాయి. ఇందులో ఐటీ, డేటా సెంటర్ ప్రాజెక్టులు రూ. 1,04,500 కోట్లు అంటే 58 శాతం. ఈ పెరుగుదలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత US H-1B వీసా విధానాలు కొనసాగితే వచ్చే డావోస్ సమ్మిట్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తోంది. ఈ పరిస్థితితో అమెరికాలో ఉద్యోగాలు తగ్గినా, హైదరాబాద్‌లో ఐటీ విస్తరణ, కొత్త గ్లోబల్ పెట్టుబడులు, ఐటీ బూమ్‌కు దారి తెరవవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.