Weather: తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం.. ఎండాకాలంలో వర్షాలకు అసలు కారణం ఏంటంటే.
సాధారణంగా శివరాత్రి తర్వాత చలి పూర్తిగా తగ్గిపోతుందని ఇక అక్కడి నుంచి ఎండలు ప్రారంభమవుతాయని అంటుంటారు. అయితే ఈసారి మాత్రం అంతకుముందే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటలకే వేడి పెరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది..

గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాల్లో సాయంత్రం చల్లటి గాలులు వీచాయి. దీనికి కారణం హైదరాబాద్ శివారుల్లో వర్షం కురవడమే. ఎండాకాలం సమీపిస్తున్న వేళ, అప్పుడే ఎండలు భగ్గుమంటున్న తరుణంలో చిరు జల్లులు కురవడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. నగరంలో పలు చోట్ల, కొన్ని శివారు ప్రాంతాల్లో కొద్దిసేపు వర్షం కురిసింది. నగరంలోని ఎల్బీనగర్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, సైదాబాద్, మాదన్నపేట్ ప్రాంతాల్లో చినుకులతోపాటు మోస్తరు వర్షం కురిసింది.
ఇదిలా ఉంటే రానున్న రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్క చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. అయితే గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడ్డట్లు అధికారులు తెలిపారు.
వర్షానికి కారణం ఏంటంటే..
గాలిలో అనిశ్చితి ఏర్పడ్డ కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా గడిచిన 10 నుంచి 20 ఏళ్లుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తోందని, వాతావరణంలో తేమ పెరగడం కారణంగా తీవ్ర ఉక్కపోత వస్తుందని అంటున్నారు.
ఈసారి భానుడి ప్రతాపం తప్పదా.?
ఇదిలా ఉంటే గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సారి సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లబడ్డ రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయనని అభిప్రాయపడుతున్నారు.