Half Day school: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఒంటి పూట బడులు.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎండలు తీవ్రమవుతోన్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది.

ఎండల తీవ్రత పెరిగింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ దంచి కొడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వేసవి సెలవుల వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికొస్తే.. ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్లలో మాత్రం సమయాల్లో తేడాలు ఉంటాయి. ఈ పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఉర్దూ పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్ అమల్లోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
కాగా ఏపీలోనూ ఒంటిపూటబడుల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యా శాఖకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ఖరారు చేశారు.