- Home
- Telangana
- Telangana: మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త అందించిన రేవంత్ సర్కార్.. ఏకంగా రూ.15లక్షలు
Telangana: మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త అందించిన రేవంత్ సర్కార్.. ఏకంగా రూ.15లక్షలు
మహిళా రైతు సంఘాలకు రూ.15 లక్షలతో గోదాములు, నిర్వహణ బాధ్యతలతో మహిళలకు స్వయం ఉపాధి నిధులు కల్పిస్తున్న రేవంత్ సర్కార్.రాష్ట్ర చరిత్రలో తొలిసారి తీసిన వినూత్న నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.

మహిళా రైతు సంఘాలకు
మహిళల అభివృద్ధికి కొత్త మార్గాలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఈసారి రైతు మహిళలపై దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతు సంఘాలకు మినీ గోదాముల నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు కేటాయించనుంది.
రాష్ట్రస్థాయి సంస్థ
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మండలాల్లో గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక జరగుతోంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గోదాములు గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నారు.నిర్మాణ బాధ్యతలు మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకే అప్పగించనున్నారు. నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రస్థాయి సంస్థ అయిన సెర్ప్ (SERP) నిర్వహిస్తుంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై సెర్ప్ సూచనలు అందించనుంది.
నాబ్‌కిసాన్ సంస్థ
ప్రతి గోదాంలో నిల్వ చేయదగిన ధాన్యం పరిమితిని నాబ్‌కిసాన్ సంస్థ అంచనా వేస్తోంది. అందుబాటులో ఉన్న భూమి పరిమితి, అవసరాల ప్రకారం నిర్మాణ డిజైన్‌ను ఖరారు చేస్తారు. దీంతో పంటల నిల్వ, భద్రతా వసతులు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇక రైతులకు దీని వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పంట చేతికొచ్చిన వెంటనే తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం లేకుండా, ధరల పెరుగుదల వచ్చేంతవరకూ భద్రంగా నిల్వ చేసుకునే వీలుంటుంది. ఇది ముఖ్యంగా చిన్నకిష్ట రైతులకు ఆదాయాన్ని పెంచే అవకాశం కల్పిస్తుంది.
స్వయం ఉపాధి అవకాశాలు
ఇక మహిళా సంఘాల దృష్టికెళితే.. ఈ గోదాముల నిర్వహణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ మహిళలకు నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకంగా మారనుంది. నిర్మాణ నాణ్యత, నిర్వహణ ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.మొదటి దశలో 31 జిల్లాల్లో గోదాములు నిర్మించనున్నారు. అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించిన మండలాల్లో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు కలిసి ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులతో పోలిస్తే, ఇది ప్రత్యేకత కలిగినది. ఎందుకంటే నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతను నేరుగా మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ మౌలిక వసతులు
ఈ గోదాములు పూర్తయిన తర్వాత గ్రామాల్లో వ్యవసాయ మౌలిక వసతులు మెరుగవుతాయి. పంట నిల్వ కేంద్రాలుగా మారడంతోపాటు, మహిళా శక్తి అభివృద్ధికి వేదికలుగా నిలవనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది.