Dasara Holidays 2025 : అక్టోబర్ 5 వరకు దసరా సెలవులే.. 6నే విద్యాసంస్థలు పున:ప్రారంభం
తెలంగాణలో కొన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులు 15 రోజులు వస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు అక్టోబర్ 4న కాకుండా 6న పున:ప్రారంభం అవుతున్నాయి. అన్ని విద్యాసంస్థలు 4నే తిరిగి తెరుచుకుంటే కొన్ని అక్టోబర్ 6న ఎందుకు తెరుచుకోనున్నాయంటే..

దసరా సెలవులు వచ్చేస్తున్నాయి..
Telangana Dasara Holidays : తెలంగాణలో ఇంకో పదిపన్నెండు రోజులే విద్యాసంస్థలు పూర్తిగా నడిచేది... తర్వాత దసరా సెలవులు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే విద్యాశాఖ ఈ సెలవులపై క్లారిటీ ఇచ్చింది... ఈ సెప్టెంబర్ 21న ప్రారంభమయ్యే సెలవులు అక్టోబర్ 3 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ 13 రోజులు సెలవులు ఉండనున్నాయి.
ఇంటర్ విద్యార్థులకు దసరాకు హాలిడేస్ ఎన్నిరోజులో తెలుసా?
అయితే రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం దసరా సెలవులు తక్కువగా రానున్నాయి. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది... అంటే స్కూళ్లకంటే వారంరోజులు ఆలస్యంగా వీరికి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే చివర్లో ఒక్కరోజు మాత్రం (అక్టోబర్ 4న) అదనంగా జూనియర్ కాలేజీలకు సెలవు ఉంటుంది. స్కూళ్లు అక్టోబర్ 4న తిరిగి ప్రారంభమైతే జూనియర్ కాలేజీలు అక్టోబర్ 6న పున:ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 5 ఆదివారం కాబట్టి స్కూళ్లు, కాలేజీలు రెండింటికీ సెలవే.
స్కూల్స్ కంటే జూనియర్ కాలేజీలకు తక్కువ హాలిడేస్
మొత్తంగా చూసుకుంటే స్కూల్ విద్యార్థులకు 13 రోజులు దసరా సెలవులుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం కేవలం ఎనిమిదిరోజులు సెలవులు ఇచ్చారు... ఇందులో రెండు ఆదివారాలే… కాబట్టి వీటిని తీసేస్తే వీరికి దసరా సెలవులు కేవలం ఆరురోజులు మాత్రమే. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తక్కువగా సెలవులు ఇస్తున్నారు.
కొందరికి దసరాకి 15 రోజులు సెలవులు?
ఆసక్తికర విషయం ఏంటంటే కొందరు స్కూల్ విద్యార్థులకు దసరాకి వరుసగా 15 రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 21న బతుకమ్మ వేడుకలతోనే దసరా సెలవులు ప్రారంభం అవుతాయి... అక్టోబర్ 3న (శుక్రవారం) దసరా తర్వాతిరోజుతో ఇవి ముగుస్తాయి. అయితే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని స్కూళ్లలో ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లకు దసరా సెలవులు ముగిశాక కూడా రెండ్రోజులు ఎక్స్ట్రా సెలవులు వస్తున్నారు. అంటే వీరికి రెండ్రోజుల వీకెండ్ సెలవులు కలిసివచ్చి దసరా సెలవులు 15 రోజులు అవుతున్నాయి.
ఏపీలో దసరా సెలవులెన్ని?
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... స్కూళ్లకు ఈ నెల(సెప్టెంబర్) 24 నుండి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి... అక్టోబర్ 2 వరకే అంటే సరిగ్గా దసరా రోజువరకే ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఇలా ఏపీ విద్యార్థులకు కేవలం 9 రోజులు మాత్రమే దసరా సెలవులుంటాయి... తెలంగాణలో కంటే నాలుగు సెలవులు తక్కువగా ఇచ్చారు. ఇక్కడ జూనియర్ కాలేజీలకు కూడా తక్కువగానే దసరా సెలవులు ఇవ్వనున్నారు... ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులపై ప్రకటన రాలేదు.