Caste Census in Telangana : తెలంగాణలో ముస్లిం జనాభా ఎంతో తెలుసా?
Caste survey 2025 : తెలంగాణలో సామాజికవర్గాలవారిగా జనాభా లెక్కలు తేల్చింది రేవంత్ సర్కార్. ఈ కుల సర్వే ప్రకారం రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంతుందో తెలుసా?

Telangana Caste Survey
Telangana Caste Survey : భారతదేశ జనాభా ఎంతంటే టక్కున వందకోట్లకు పైనే అని సమాధానం వినిపిస్తుంది. అలాగే తెలంగాణ జనాభా ఎంతంటే మూడున్నర కోట్లు అని టక్కున చెప్పవచ్చు. మరి సామాజికవర్గాలవారిగా అంటే ఓసి, బిసి, ఎస్సి, ఎస్టీల జనాభా ఎంతంటే నో ఆన్సర్... ఎందుకంటే స్వాతంత్య్రం తర్వాత ఇప్పటివరకు దేశంలో కులాలు, సామాజికవర్గాలవారిగా జనాభా లెక్కింపు జరగలేదు. అందువల్లే ఏ సామాజికవర్గం జనాభా ఎంతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి వుంది.
అయితే ఈ కన్ఫ్యూజన్ ను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాజికవర్గాలవారిగా జనాభా లెక్కలు తేల్చేందుకు రేవంత్ సర్కార్ కులగణన చేపట్టింది. సమగ్ర సర్వే పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ నివేదికను ఇవాళ (మంగళవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అసెంబ్లీ ముందుంచారు. అంతకుముందు ప్రత్యేకంగా సమావేశమైన మంత్రిమండలి ఈ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వే-2024 నివేదికను ఆమోదించింది.
ఇప్పటికే ఈ కుల సర్వే 2024 కు సంబంధించిన వివరాలను బైటపెట్టింది ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ నివేదిక అందగానే ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు వివరాలను వెల్లడించారు. తెలంగాణలో ఏ సామాజికవర్గం జనాభా ఎంతుందో ప్రకటించారు. ఈ సర్వే సమాచారం ఇలా వుంది.
Telangana Caste Survey
కుల సర్వే 2024 ప్రకారం తెలంగాణలో ఎవరి జనాభా ఎంత :
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జనగణన జరిగింది కానీ కులగణన జరగలేదు... కానీ ఇటీవల బిహార్ వంటి రాష్ట్రాలు కులగణన చేపట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ కులగణన చేపట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ కులగణనపై నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాదిలో దీన్ని పూర్తిచేసారు.
50 రోజులపాటు (నవంబర్ 6, 2014 న ప్రారంభించి డిసెంబర్ 25, 2024లో పూర్తి) దాదాపు 1,03,889 మంది సిబ్బంది ఈ కుల సర్వే చేపట్టారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని 3.54 కోట్లమంది ప్రజలు పాల్గొన్నారు. అతి తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా ఈ సర్వేను పూర్తిచేసినట్లు ప్రణాళికసంఘం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు.
కుల సర్వే 2024 ప్రకారం తెలంగాణలోని మొత్తం కుటుంబాలు 1,15,79,457 ఉన్నాయి. వీరిలో 96.9 శాతం అంటే 1,12,15,134 కుటుంబాలు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గోన్నాయి. కేవలం 3.1 శాతం కుటుంబాలు వివిధ కారణాలతో ఈ సర్వేకు దూరంగా వున్నట్లు ప్రకటించారు. జనాభాపరంగా చూస్తే 3,54,77,554 మంది సర్వేలో పాల్గొంటే 16 లక్షల మంది మాత్రం దూరంగా వున్నారు.
ఈ కుల సర్వే ప్రకారం తెలంగాణలో పురుషులు 1,79,21,183 (50.51 శాతం), మహిళలు 1,75,42,597 (49.45 శాతం) ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ వారు 13,774 (0.01 శాతం) ఉన్నారు.
సామాజికవర్గాల వారిగా చూస్తే మొత్తం జనాభాలో బిసిలు 1,64,09,179 (46.25 శాతం) మంది ఉన్నారు. ముస్లింలలో మరో 35,76,588 (10.8 శాతం) మంది బిసిలు వున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో బిసి జనాభా శాతం 56 శాతానికి పైగానే వుంది.
ఇక తెలంగాణలో ఎస్సిలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ఓసీలు 47,21,115 (13 శాతం) వున్నారు. ముస్లింలలో ఓసి సామాజికవర్గానికి చెందినవారు 8,80,424 (2.48 శాతం) ఉన్నారు. మొత్తంగా జనరల్ మరియు ముస్లింలను కలిపితే ఓసి జనాభా 15 శాతానికి పైనే వుంది.
ఈ కుల సర్వే 2024 లో ముస్లింలను రెండు వర్గాలుగగా విభజించారు. బిసిలను వేరుగా, ఓసీలను వేరేగా లెక్కించారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ముస్లిం జనాభా 44,57,012 (12.56 శాతం) ఉందని కుల సర్వే తేల్చింది.
Telangana Caste Survey
కుల సర్వే కు ఎంత ఖర్చయ్యిందో తెలుసా?
బిహార్ లో కూడా కులగణన చేపట్టారు... ఇక్కడ దాదాపు ఆరు నెలలపాటు ఈ సర్వే చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.ఇందుకోసం ఆ రాష్ట్రం ఏకంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం కేవలం 50 రోజుల్లోనే రూ.160 కోట్లు మాత్రమే ఖర్చు చేసి సమగ్ర కుల సర్వే చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కుల సర్వే 2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇప్పటివరకు దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి సరైన ఢేటా లేదు... దీంతో రిజర్వేషన్లు అమలు విషయంలో వారికి అన్యాయం జరుగుతోందని అన్నారు. 1931 తర్వాత ఇప్పటివరకు బలహీనవర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేసింది... ముందుగా అధికారంలో వున్న తెలంగాణలో చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణలోని ప్రతి మారుమూల గ్రామం, ప్రతి గిరిజన తండాలో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని రేవంత్ పేర్కొన్నారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని... 76 వేలమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారన్నారు.
కుల సర్వే 2024 కు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు.