- Home
- Telangana
- Telangana Congress : తెలంగాణకు బిసి సీఎం... మరి రేవంత్ పరిస్థితి? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Telangana Congress : తెలంగాణకు బిసి సీఎం... మరి రేవంత్ పరిస్థితి? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Telangana Politics : తెలంగాణ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? రాష్ట్ర పిసిసి చీఫ్ సైతం బిసి సీఎం నినాదం ఎత్తుకోవడం వెనక అంతరార్థం ఏమిటి? రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందా?... ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
revanth reddy
Congress Party : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే డిల్లీకి వెళుతున్నారు... కానీ కాంగ్రెస్ అదిష్టానంలో ఏం మాట్లాడుతున్నారో భయటపెట్టడంలేదు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడానికే అంటున్నా కేవలం అందుకోసమే కాదంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాల మాటలు, కాంగ్రెస్ నాయకుల తీరు, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఏదో జరుగుతోందని అర్థమవుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ లో పరిస్థితి చూస్తుంటే ప్రతిపక్షాలు అనుమానిస్తున్నట్లే రేవంత్ రెడ్డి సీఎం పదవికి గండం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలోని బిసిలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ బెడిసికొట్టి సీఎం రేవంత్ కు తలనొప్పి తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ నాయకులే బిసి కులగణనను వ్యతిరేకించడం, బిసి కులాలు ఈ కులగణన నివేదికను తప్పుబట్టడంతో రేవంత్ ఇరకాటంలో పడ్డారు. ఇదే అదునుగా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా అదిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కాదు స్వయంగా కాంగ్రెస్ నాయకులే బిసి ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నుండి ఇప్పుడు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరకు ఒక్కటే మాట...తెలంగాణకు బిసి సీఎం తప్పకుండా వస్తాడని. ఇలా కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే రేవంత్ రెడ్డి పూర్తికాలం సీఎంగా ఉంటారా? మధ్యలోనే ఊడబీకుతారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ మొదలయ్యాయి.
Telangana Congress
రేవంత్ రెడ్డి డిల్లీ ప్రదక్షిణలు అందుకోసమేనా?
బిజెపితో పాటు ప్రాంతీయ పార్టీలలో కేవలం కొందరు నాయకుల చుట్టే రాజకీయాలు నడుస్తాయి... కానీ కాంగ్రెస్ లో అలాకాదు ప్రతి నాయకుడికి స్వేచ్చ ఉంటుంది. అందుకే కనీసం ఎమ్మెల్యేగా గెలవనివారు కూడా ముఖ్యమంత్రి, మంత్రుల గురించి మాట్లాడుతుంటారు... కాబట్టి ఈ పార్టీలో అంతర్గత విబేధాలు సర్వసాదారణం. ఆ పార్టీలో ఎవరికి ఏ పదవి శాశ్వతం కాదు... ఎంత లాబీయింగ్ చేయగలిగితే అంత మంచి పదవి వస్తుంది.
ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతోందట. కాంగ్రెస్ లో ముందునుండి ఉన్న తమకు కాదని రేవంత్ రెడ్డిని సీఎం చేయడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటివారు గుర్రుగా ఉన్నారు. అవకాశం లేక రేవంత్ కు సహకరిస్తున్నారే తప్ప వీరికి సీఎం పదవిపై ఆశ చావలేదు. ఇక ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారు కూడా సీఎం రేసులోకి వచ్చారు. వీరంతా తెరవెనక ముఖ్యమంత్రి పదవికోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది పసిగట్టిన రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి ఊడకుండా డిల్లీ చూట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకే ఆయన కూడా డిల్లీ వేదికగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షిపై వేటు... తన వ్యతిరేక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారనే ఆమెపై రేవంతే వేటు వేయించారనే ఓ ప్రచారం జరుగుతోంది. సీఎం డిల్లీలో ఉండగానే తెలంగాణ ఇంచార్జీని మార్చడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
Revanth Reddy
కలెక్టర్లకు రేవంత్ వార్నింగ్ అందులో భాగమేనా?
'నాయకులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ ఐఏఎస్, ఐపిఎస్ లు మాత్రం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉండాలి. ప్రజా ప్రయోజనాల కోసమే ఆలోచించాలి'... ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు సివిల్ సర్వెంట్స్ కు చురకలు అంటించినట్లే ఉన్నా అంతరార్థం మాత్రం వేరేలా వున్నట్లు అనిపిస్తోంది.
కొందరు ఉన్నతాధికారులు తన మాట వినకుండా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సీఎం రేవంత్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ లు తమ పదోన్నతుల కోసమో ఇంకా వేరే ఏదయినా ఆశించో కొందరు నాయకులు ఎలా చేబితే అలా చేస్తుంటారు. ఇలా అధికారులను చేతిలో పెట్టుకుని తనపై పైచేయి సాధించాలని అనుకుంటున్న తన సహచర నాయకులకు చెక్ పెట్టేందుకు రేవంత్ ఐఏఎస్, ఐపిఎస్ లపై గరం అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా రేవంత్ వరుస డిల్లీ పర్యటనలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మార్పు, ఇప్పుడు ఐఎఎస్, ఐపిఎస్ లకు వార్నింగ్...ఇవన్నీ చూస్తుంటే రేవంత్ కు పదవీగండం ఉందన్న ప్రతిపక్షాల అనుమానాలకు బలం చేకూరుతోంది. మరి నిజంగానే తెలంగాణ సీఎంను మార్చేందుకు తెరవెనక ఏవయినా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకోసమే కాంగ్రెస్ నాయకులు బిసి నినాదం ఎత్తుకున్నారా? అన్నది భవిష్యత్ రాజకీయాలే తేలుస్తాయి.