రూ.2,000 కోట్ల పెట్టుబడులతో... వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్
ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటుచేసిన వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇవాళ ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే... ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయని అన్నారు.
ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని అన్నారు. అలాగే మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని...మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయని వెల్లడించారు. ఇన్నీ కంపెనీలలో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని... ఈ క్రమంలోనే స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
ఈ ప్రాంతంలో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కావాలని.. కంపనీల రాకతో ఈ ప్రాంతంలో రూపు రేఖలు మారిపోతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. చందన్‌వెల్లి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.